గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ధరణి పోర్టల్( Dharani ) పై విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేశాయి.ధరణి పోర్టల్ ద్వారా బీఆర్ఎస్ నాయకులు భూకబ్జాలకు పాల్పడుతున్నారని అప్పట్లో కాంగ్రెస్ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి తో పాటు , బిజెపి నేతలు విమర్శలు చేశారు.
అయినా ధరణి పోర్టల్ ను బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగానే తీసుకుంది.దీనిపై కామెంట్స్ చేస్తున్న వారిపైన అప్పటి సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
అధికార నాయకుల అక్రమాలకు ధరణి అడ్డగా మారిందని, అప్పట్లో కాంగ్రెస్, బిజెపిలు విమర్శలు చేశాయి.అయితే వీటిని బిఆర్ఎస్ తిప్పికొట్టింది.
ధరణి పోర్టల్ పై విపక్షాలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నాయని కెసిఆర్ పదేపదే ప్రస్తావించేవారు.
ఇక కాంగ్రెస్ ఎన్నికల సమయంలో తమ మేనిఫెస్టోలో ధరణి ని రద్దు చేస్తామని పేర్కొన్నారు.ధరణి పేరుతో ఎన్నో లక్షల ఎకరాల్లో అక్రమాలు జరిగాయని విమర్శించారు.అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ధరణి పోర్టల్ పై ప్రత్యేకంగా దృష్టి సారించారు.
ఈ మేరకు నిన్న సచివాలయంలో ధరణి పోర్టల్ పై అధికారులతో సమీక్ష నిర్వహించారు .ఈ భేటీకి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టు విక్రమార్క( Mallu Bhatti Vikramarka ), మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ,దామోదర రాజనర్సింహ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సిసిఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.సమీక్ష తరువాత నిషేధిత జాబితా అసైన్డ్ భూములు, పట్టా భూములు తదితర అంశాలతో పాటు, సమావేశంలో మంత్రులు లేవనెత్తిన అన్ని అంశాల పైన నివేదిక ఇవ్వాలని నవీన్ మిట్టల్ ను రేవంత్ ఆదేశించారు.
ధరణి పోర్టల్ లో చాలా లొసుగులు ఉన్నాయని అప్పట్లో రేవంత్ ఆరోపణలు చేశారు. అధికారంలోకి రాగానే ధరణిని ప్రక్షాళన చేస్తామని, ధరణి పోర్టల్ లో మార్పులు చేసి దాని పేరు భూమాతగా మారుస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. ఆ హామీలో భాగంగానే ఇప్పుడు ఈ పోర్టల్ లోని లోపాల పైన దృష్టి సారించారు.ధరణి పోర్టల్ ద్వారా సామాన్య రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇప్పటికే లక్షల సంఖ్యలో ఫిర్యాదులు ఉన్నాయని , వీటి పరిష్కారానికి మండల స్థాయి గ్రీవెన్స్ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో రేవంత్( Revanth Reddy ) ఉన్నారు.
ధరణి లావాదేవాలపై వస్తున్న విమర్శలపైన వివరణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.సమస్యల పరిష్కారానికి మండల స్థాయిలో నిర్వహించే గ్రీవెన్స్ పై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.