కొత్త రాష్ట్రంలో అధికారం కోల్పోయిన మూడేళ్ల తర్వాత టీడీపీలో మహానాడు కార్యక్రమం ప్రాణం పోసింది.మహానాడు తర్వాత ఏపీలో టీడీపీ గ్రాఫ్ పెరిగిందనేది వాస్తవం.
కానీ గ్రౌండ్ రియాలిటీలో ఆ పార్టీలో జోష్ కనిపించడం లేదు.ప్రస్తుతం అధికారంలో ఉండి కూడా వైసీపీ వచ్చే ఎన్నికల కోసం తీవ్రంగా కష్టపడుతోంది.
మరోసారి విజయం సాధించకపోతే తమ పరిస్థితి ఏమవుతుందోనన్న భయం వైసీపీ నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది.దీంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు పలు కార్యక్రమాలు చేపడుతున్నారు.
వైసీపీ వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకుంటుందా.లేదా అనే విషయాన్ని పక్కన పెడితే నిరంతరం ఆ పార్టీ పెద్దలు పార్టీలో జోష్ నింపే కార్యక్రమాలకు పెద్దపీట వేస్తున్నారు.
ఇటు ప్రభుత్వం పరంగా అటు పార్టీ పరంగా కూడా కార్యకర్తల్లో జోష్ తగ్గకుండా చూసుకుంటున్నారు.సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వంటి సీనియర్ నేతలు నిత్యం పార్టీ కార్యక్రమాలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు.
అయితే వైసీపీలో కనిపించిన జోష్ టీడీపీలో కనిపించడం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.అన్నీ చంద్రబాబు చూసుకుంటున్నారులే అనే ధీమా టీడీపీ నేతల్లో కనిపిస్తోంది.
చంద్రబాబు వస్తే పండగ.లేకపోతే దండగ అన్నట్టుగా పార్టీ వ్యవహారాలు నడుస్తున్నాయి.
వయసు మీద పడినా చంద్రబాబు కష్టపడుతున్నారులే అని ఆయనకు మద్దతుగా నిలిచేవారు టీడీపీలో ఏ కోశాన కనిపించడం లేదని ఆ పార్టీలోనే టాక్ నడుస్తోంది.మహానాడు తర్వాత టీడీపీలో పరిణామాలను గమనిస్తే అన్ని నియోజకవర్గాల్లో మినీ మహానాడులు నిర్వహించాలని పార్టీ నేతలకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
అయితే దీనికి సంబంధించి టీడీపీ నేతలు ముందుకు సాగడం లేదు.తమంతట తాము ముందుకు వచ్చి ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసే పరిస్థితులు కనిపించడం లేదు.
ఏదైనా కూడా చంద్రబాబు నిర్దేశించాలి.ఆయన చేయాలి.
ఆయన వెనుక మేం నడుస్తాం అనే ధోరణిలోనే టీడీపీ నేతలు ఉన్నారు.

వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతిపక్ష నేతలను వేధించడం వారిని బూతులతో తిట్టించడం, ఇళ్లల్లోని మహిళలను , చిన్న పిల్లలను సైతం వదిలి పెట్టకుండా వారి పైన అసభ్యకరంగా అభ్యంతకర వ్యాఖ్యలు చేయించడం ఇప్పటి వరకు రాజధానిని అతీగతీ లేకుండా చేయడం, రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం ఇప్పటికీ పూర్తి కాకపోవడం, ప్రత్యేక హోదా ఉసే లేకపోవడం వంటి జగన్ ప్రభుత్వానికి మైనస్‌లుగా కనిపిస్తున్నాయి.వీటిని సానుకూలంగా మలుచుకుని టీడీపీ ప్రజల్లోకి వెళ్లాల్సి ఉంది.కానీ తెలుగు తమ్ముళ్లు ముందుకు అడుగు వేయడం లేదు.
వచ్చే ఎన్నికల్లో పొత్తు అంశం కూడా పార్టీ మనుగడపై ప్రభావంపై చూపుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.పొత్తులపై చంద్రబాబు క్లారిటీ ఇచ్చి ఇప్పటికైనా తెలుగు తమ్ముళ్లలో జోష్ నింపాలని పలువురు కోరుతున్నారు.