ప్రతిరోజూ 1,600 దేశీయ, అంతర్జాతీయ విమానాలను నడిపే ఇండిగో ఎయిర్‌లైన్స్ ఉద్యోగులు ఒకేసారి సెలవు తీసుకున్నారు.దీంతో సమయానికి నడవాల్సిన విమానాలను చాలా ఆలస్యంగా నడుస్తున్నాయి.
శనివారం ఏకంగా 55% సర్వీసులు ఆలస్యమయ్యాయి.దీనికి కారణం చాలా మంది సిబ్బంది ఎయిర్ ఇండియా అనేక నగరాల్లో నిర్వహిస్తున్న వాక్-ఇన్ ఇంటర్వ్యూలలో పాల్గొనడానికి సెలవు పెట్టడమే అని తెలుస్తోంది.
ఇంకొందరు ఉద్యోగులు అనారోగ్యం కారణంగా సెలవు పెట్టారు.దాంతో సిబ్బంది కొరత ఏర్పడగా ప్రస్తుతం ఇండిగో విమాన సర్వీసుల్లో ఆలస్యం నెలకొంది.
కేవలం 45 శాతం సర్వీసులు మాత్రమే సమయానికి బయలుదేరుతున్నాయని ప్రభుత్వ అధికారులు తెలిపారు.ఇండిగో మాత్రం ఈ ఆలస్యం గురించి ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.
ఈ విషయం గురించి కేంద్ర విమానయాన మంత్రిత్వశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.ఎయిరిండియా రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో పాల్గొనేందుకు ఇండిగో క్యాబిన్ సిబ్బందిలోని చాలామంది ఉద్యోగులు సెలవులు పెట్టినట్టు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.
ఒకేసారి భారీ సంఖ్యలో దేశవ్యాప్తంగా విమాన సర్వీసులు ఎందుకు ఆలస్యంగా నడుస్తున్నాయనే అనేదానిపై వివరణ ఇచ్చుకోవాల్సిందిగా ఇండిగోని ఇప్పటికే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విజ్ఞప్తి చేసింది.

శనివారం సకాలంలో విమానాలను నడిపిన ఎయిర్ లైన్స్‌లో ఎయిర్ ఏసియా ఇండియా 92.3 శాతంతో మొదటి స్థానంలో ఉంది.ఆ తర్వాత 88% తో గో ఫస్ట్ సంస్థ, 86.3 శాతంతో విస్తారా, 80.4 శాతంతో స్పైస్‌జెట్, 77.1 శాతంతో ఎయిరిండియా తర్వాతి స్థానాల్లో ఉండగా ఇండిగో 45.2 శాతంతో చిట్ట చివరి స్థానంలో నిలిచింది.







