పశ్చిమగోదావరి జిల్లా భీమవరం లో ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఉంది.అల్లూరి సీతారామరాజు 125 వ జయంతి సందర్భంగా ఆయన కాంస్య విగ్రహాన్ని ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించనున్నారు.
ఈ కార్యక్రమానికి భారీగా ఏర్పాట్లు చేశారు.ప్రధానికి ఏపీ సీఎం జగన్ స్వాగతం పలకడంతో పాటు, గన్నవరం నుంచి ఓకే హెలికాప్టర్ లో భీమవరం చేరుకుంటారు.
అయితే స్థానిక ఎంపీ హోదాలో ఈ కార్యక్రమంలో పాల్గొని తన సత్తా చాటాలని భావించిన నరసాపురం వైసిపి రెబల్ ఎంపీ రఘురాం కృష్ణంరాజు ఇప్పుడు తన పర్యటన ను అర్ధాంతరంగా వాయిదా వేసుకుని బేగంపేట రైల్వే స్టేషన్ నుంచి వెనుదిరిగారు.కొద్దిరోజుల నుంచి భీమవరం వచ్చేందుకు రఘురామ హడావుడి చేస్తూనే ఉన్నారు.
కేంద్ర బిజెపి పెద్దలతో పాటు, కేంద్ర హోంశాఖ అధికారులకు ఆయన లేఖలు రాశారు.
అంతేకాకుండా ఏపీ హైకోర్టులోను దీనిపై పిటిషన్ వేశారు .భీమవరం పర్యటనకు తాను వెళుతున్నానని , తనకు ఏపీ పోలీసులు భద్రత కల్పించే విధంగా అరెస్టు చేయకుండా చూసే విధంగా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని రఘురాం కృష్ణంరాజు పిటిషన్ దాఖలు చేశారు.అయితే ఆయనకు కోర్టులో ఆశించిన స్థాయిలో సానుకూలత లభించలేదు.
కేంద్రం తనకు ఇప్పటికే జెడ్ ప్లస్ భద్రత కల్పించిందని ఒకవైపు చెబుతూనే మరోవైపు పోలీసులు భద్రత కోరడం ఏమిటంటూ హైకోర్టు ప్రశ్నించింది.స్థానిక పోలీసుల కంటే ఎస్పీజీ అందించే జెడ్ ప్లస్ కేటగిరి పటిష్టమైనదని, అటువంటప్పుడు స్థానిక పోలీసుల భద్రత అవసరం లేదని హైకోర్టు పేర్కొనడంతో రఘురామ ఏదో విధంగా భీమవరం లో జరిగే కార్యక్రమంలో పాల్గొనాలని భావించారు.

ఈ మేరకు రైలులో భీమవరం చేరుకోవాలని భావించిన రఘురామకృష్ణంరాజు మధ్యలోనే ఆదివారం రాత్రి వెనుదిరిగారు.ఏపీ పోలీసులు తమను అనుసరిస్తున్నారని ఆయన హైదరాబాదులోని బేగంపేట రైల్వేస్టేషన్ లో రైలు దిగిపోయారు.తన వెంట ఉన్న వారి అందరిపై ఇప్పటికే అనేక కేసులు ఉండడంతో, వారిని మరింత ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక తన పర్యటనను రద్దు చేసుకుని వెళ్లిపోయినట్లుగా ఆయన చెబుతూ వీడియోను విడుదల చేశారు.రఘురాం వెనక్కి తగ్గడంపై వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నా, ప్రధాని పర్యటనలో పాల్గొంటే ఆయనకు వ్యతిరేకంగా భారీ ఎత్తున నిరసన తెలుపాలని ముందుగా భావించినా ఇప్పుడు రఘురామ వెనకడుగుతో ఆ ప్రయత్నాలను విరమించుకున్నారు.







