ఏపీలో త్వరలో వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.సోమవారం నాడు సీఎం జగన్ సతీసమేతంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో సమావేశమైన సందర్భంగా ఈ విషయం బయటకు వచ్చింది.
గవర్నర్‌తో భేటీలో వర్షాకాల అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై సీఎం జగన్ చర్చించినట్లు తెలుస్తోంది.వైసీపీ సర్కారు ఇటీవల కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ చేసిన అనంతరం జరిగే మొదటి అసెంబ్లీ సమావేశాలు ఇవే కావడం విశేషం.
త్వరలో జరిగే వర్షాకాల సమావేశాల్లో జగన్ ప్రభుత్వం కీలక బిల్లులు ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.అయితే ఆ బిల్లులలో రాజధాని బిల్లు ఉంటుందా అనే విషయం ఆసక్తి రేపుతోంది.
ఇప్పటికే ఆగస్టు తర్వాత ఏపీలో కీలకమైన పరిణామాలు సంభవిస్తాయని మంత్రి ఆదిమూలపు సురేష్ హింట్ ఇచ్చిన నేపథ్యంలో మూడు రాజధానులకు సంబంధించిన సమగ్రమైన బిల్లు ఈ వర్షాకాల సమావేశాల్లోనే అసెంబ్లీ ముందుకు రావడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇటీవల జగన్ పలు జిల్లాలలో నిర్వహించిన సభలలోనూ రాజధాని విషయంలో టీడీపీని, ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై సెటైర్లు వేస్తూ ప్రసంగాలు చేశారు తప్పితే కనీసం మన రాజధాని అమరావతి అని మాత్రం ఎక్కడా అనలేదు.దీంతో రాజధాని విషయంలో వైసీపీ మళ్లీ పాత పంథానే అనుసరించబోతుందనే చర్చ జరుగుతోంది.జగన్ ఒకసారి ఫిక్స్ అయితే కాస్త ఆగుతారే తప్ప అమలు చేయకుండా ఉండరని వైసీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు.

అంటే మరోసారి మూడు రాజధానులపైనే వర్షాకాల సమావేశాల్లో జగన్ ప్రభుత్వం బిల్లు పెట్టడం ఖాయమని స్పష్టమవుతోంది.దీంతో మరోసారి రాజధానిపై వైసీపీ రాజకీయ చదరంగం ఆడనుంది.ఈ సమావేశాల్లో చంద్రబాబు సభకు రాకపోయినా ఆయన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు వస్తారు.వారు కచ్చితంగా అమరావతి విషయంలో ఏ రకమైన నిర్ణయం తీసుకున్నా వ్యతిరేకించి తీరుతారు.దీంతో రచ్చ జరగడం.వారిని సస్పెన్షన్ పేరుతో సభ నుంచి బయటకు పంపడం జరుగుతుందనే విషయాన్ని ముందుగానే ఊహించవచ్చు.







