ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తరువాత జరిగిన ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు విజయం సాధించిన బీఆర్ఎస్( BRS ) మూడోసారి మాత్రం కాంగ్రెస్( Congress ) చేతిలో ఓటమి చెందింది.ఇక అప్పటి నుంచి ఆ పార్టీకి కష్టాలు మొదలయ్యాయి.
పార్టీలో కీలక నేతలుగా గుర్తింపు పొంది, అనేక పదవులు అనుభవించిన నేతలు అంతా బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిపోతుండడం వంటి పరిణామాలతో పాటు , ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత( MLC Kavitha ) ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో అరెస్టు అయ్యి, ఇప్పటికీ జైల్లోనే ఉండడం వంటి వ్యవహారాలతో బీఆర్ఎస్ అధినేత కెసిఆర్( KCR ) కాస్త డీలా పడ్డారు.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దగ్గర నుంచి పెద్దగా ఆయన జనాల్లోకి రావడం లేదు.
ఇటీవల అసెంబ్లీలోకి అడుగుపెట్టారు.మొత్తం వ్యవహారాలన్నీ కేటీఆర్ హరీష్ రావులే చూసుకుంటున్నారు.పార్టీకి సంబంధించిన అనేక నిర్ణయాలను మీడియా ముఖంగా వెల్లడిస్తూ, ఇక అంతా తానే అన్నట్లుగా కేటీఆర్( KTR ) వ్యవహరిస్తున్నారు.అయితే గత కొంతకాలంగా కేసీఆర్ కేటీఆర్ ల మధ్య దూరం పెరిగిందని, ఇద్దరికీ పొసగడం లేదనే వార్తలు తెరపైకి వచ్చాయి.
కెసిఆర్ కేటీఆర్ ల మధ్య పంచాయతీ నడుస్తోందని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) కొత్త చర్చకు తెర లేపారు.గతంలోనే జరిగిన ప్రచారానికి తాజాగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మరింత బలం చేకూరింది.
కొద్దిరోజుల కిందటే అసెంబ్లీకి కేసిఆర్ రారని కేటీఆర్ ప్రకటించారు .కానీ ఆ మరుసటి రోజు కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యారు.కొంతకాలం కింద కేసీఆర్ , కేటీఆర్ ల మధ్య అభిప్రాయ బేధాలు వచ్చాయనే ప్రచారం జరిగింది.పార్లమెంట్ ఎన్నికల సమయంలో బిజెపితో కలిసి ఎన్నికలకు వెళ్దామని కేటీఆర్ ప్రతిపాదించారని, కానీ దానిని కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకించారని, దీంతో ఫలితాలు తర్వాత కెసిఆర్, కేటీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా ప్రచారం జరిగింది.
తాజాగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో మరోసారి కేటీఆర్ కెసిఆర్ మధ్య దూరం పెరిగిందనే విషయం చర్చనీయాంశంగా మారింది.