రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సర్వ సాధారణమే.అధికార పార్టీ ఏ స్టెప్ వేసినా దానిపై రాద్ధాంతం చేయడానికి ప్రతిపక్షాలు ఎప్పుడూ కాచుకునే కూర్చుంటాయి.
అయితే ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకోకుండా వ్యూహాత్మక మౌనం పాటిస్తూ తాను చేయాలనుకుంది, చెప్పాలనుకుంది సైలెంట్ గా చేసుకుంటూ ముందుకు వెళ్లిపోవడం లో ఏపీ సీఎం జగన్ బాగా ఆరితేరిపోయారు.జగన్ పాలనపై, ప్రభుత్వ పథకాల అమలుపై అటు టీడీపీ, బీజేపీ కానీ, ఇటు జనసేన కానీ ఎన్ని విమర్శలు చేస్తున్నా వైసీపీ నాయకులే స్పందిస్తున్నారు తప్ప జగన్ ఎక్కడా నోరు జారడంలేదు.
ఇదంతా జగన్ రాజకీయ వ్యూహంలో భాగమే అన్నట్టుగా అర్ధం అవుతోంది.జగన్ ఫెయిల్యూర్ సీఎం అంటూ టీడీపీ అదే పనిగా విమర్శలు చేస్తున్నా జగన్ మాత్రం పాలనాపరమైన దూకుడు ప్రదర్శిస్తూనే ఉన్నారు.
ముఖ్యంగా ఏపీ విషయంలో పరిపూర్ణమైన అవగాహన జగన్ కు ఉన్నట్టుగా కనిపిస్తోంది.ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృధ్ధి చేయాలన్న అజెండా వైఎస్ జగన్ మెదడులోనే ఉన్నట్లుగా అర్ధమవుతుంది.
అందుకే వైఎస్ జగన్ సీఎం గా సంతకం చేయగానే క్షణం కూడా ఆలస్యం చేయకుండా వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.నిధులు ఎలా వస్తాయన్న విషయం పక్కనపెడితే తన చిత్తశుద్ధిని జగన్ బాగానే రుజువు చేసుకుంటున్నారు.
మాట ఇస్తే మడమ తిప్పననే నినాదాన్ని నిజం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది.
ఇక ఏపీ రాజధాని అమరావతి విషయంలోనూ జగన్ ఆచి తూచి వ్యవహరిస్తున్నాడు.అమరావతి నిర్మాణం తమకు తలకు మించిన భారంగా జగన్ భావిస్తున్నాడు.అందుకే ఆ విషయంలో ముందుకు వెళ్లేందుకు వెనకడుగు వేస్తున్నాడు.
అయితే ఆ మాటలు నేరుగా చెప్పకండా జగన్ రాజకీయ చాణిక్యం ప్రదరిస్తున్నాడు.ప్రస్తుతం ఉన్న అమరావతి రాజధానిని అకస్మాత్తుగా కాదు అంటే వచ్చే ఇబ్బందులు బాధలు జగన్ కి తెలియనివి కావు, పైగా అక్కడ ఉన్న బలమైన సామాజికవర్గం, దానికి దన్నుగా ఉన్న రాజకీయ నాయకత్వం సృష్టించే ఇబ్బందులు అన్నీ జగన్ కి బాగా తెలుసు.
అందుకే ఆయన ఇప్పటివరకు అమరావతి మీద పెదవి విప్పలేదు.అంతే కాదు.
తన అభిప్రాయం ఏంటో చెప్పకుండానే మంత్రి బొత్స సత్యనారాయణ ద్వారా తన మనసులోని ఉద్దేశాలను జనాల్లోకి పంపించి ఫీడ్ బ్యాక్ బాగానే సేకరించారు.అమరావతి రాజధాని కాదు అంటే రెండు జిల్లాల జనమే వ్యతిరేకిస్తారు, అందునా పూర్తిగా కాదు, కొన్ని ప్రాంతాలకే ఆ వ్యతిరేకత ఉంటుంది అనే విషయాన్నిజగన్ ఈ సందర్భంగా గ్రహించారు.
అమరావతి లో రాజధాని ఉండడం వైసీపీ ప్రభుత్వానికి ఇష్టం లేదు అనే విషయాన్ని జగన్ ఎక్కడా తన నోటితో చెప్పకుండా, ఇక ముందు కూడా చెప్పే అవసరం లేకుండా ప్రత్యామ్న్యాయ మార్గంగా పట్టణాభివృధ్ధిలో నిపుణులు, నిష్ణాతులతో ఓ కమిటీని ఆయన తాజాగా ఏర్పాటు చేశారు.ఈ కమిటీకి ఒక్క అమరావతి రాజధాని మాత్రమే కాకుండా ఏపీ సమగ్ర అభివృధ్ధిపై అధ్యయనం చేసే బాధ్యతను వైఎస్ జగన్ అప్పగించారు.అమరావతిలో వరదల నిర్వహణ, అక్కడ పర్యావరణ పరిస్థితులపైన కూడా ఈ కమిటీ పూర్తిగా అధ్యయనం చేసి ఆరువారాల్లోగా ప్రభుత్వానికి నివేదిక అందిస్తుంది.ఈ నివేదిక తమకు అందగానే వైసీపీ దీనిపై స్పందించాలని చూస్తోంది.
అదీ కాకుండా నిపుణుల కమిటీ కాబట్టి దీనిపై ఎవరికీ పెద్దగా అభ్యంతరాలు ఉండవు అనేది వైసీపీ లెక్క.అదీ కాకుండా ఈ కమిటీ ఏపీ సమగ్రాభివృద్ధిపై కూడా నివేదిక సమర్పిస్తుంది కాబట్టి అన్ని ప్రాంతాలకు అభివృద్ధిని విస్తరించవచ్చని తద్వారా మిగిలిన అన్ని ప్రాంతాల్లో ప్రభుత్వంపై సానుకూల దృక్పధం ఏర్పడుతుందనేది జగన్ లెక్కగా అర్ధం అవుతోంది.