డిప్రెషన్.చాలా మంది దీనిని చిన్న సమస్యగా భావిస్తారు.
కానీ, నిలువెత్తు మనిషిని మానసికంగా మరియు శారీరకంగా కృంగదీసే ప్రమాదకరమైన సమస్య ఇది.వయసుతో సంబంధం లేదు.ఎవ్వరైనా డిప్రెషన్ బారిన పడే అవకాశాలు ఉంటాయి.దీనిని నిర్లక్ష్యం చేసే కొద్ది ప్రాణాలే రిస్క్‌లో పడతాయి.అందుకే వీలైనంత త్వరగా డిప్రెషన్‌ను వదిలించుకోవాలి.అయితే కొందరికి తాము డిప్రెషన్‌లో ఉన్నాము అన్న విషయాన్నే గ్రహించలేకపోతుంటారు.
అసలింతకీ డిప్రెషన్ లో ఉన్నారా.? లేదా.? అన్నది తెలుసుకోవడం ఎలా అంటే కొన్ని కొన్ని లక్షణాల బట్టి గుర్తించవచ్చు.మరి ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
ఒంటిరితనానికి ప్రాధాన్యత ఇవ్వడం.అంటే ఎప్పుడు ఒంటరిగానే కూర్చుంటారు.బయట వ్యక్తులతోనే కాదు ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్‌తోనూ కలవరు.కనీసం మాట్లాడడానికి కూడా ఇష్టపడరు.ఇది డిప్రెషన్ లక్షణాల్లో ఒకటి.అలాగే డిప్రెషన్ బారిన పడ్డవారు ఎప్పుడో జరిగిపోయిన విషయాలను గుర్తుకు తెచ్చుకుని తరచూ బాధపడుతుంటారు.అనవసరమైన విషయాల్లో కంగారు పడుతుంటారు.ఇష్టమైన వ్యక్తులు, ఆహారాలు, ప్రదేశాలు తదితర వాటిపై ఆసక్తిని కోల్పోతుంటారు.

ఆందోళన, దూకుడు, తొందర పాటు, విసుగు, అసమర్థత, గుండెల్లో దడ, ఉన్నట్టు ఉండి బరువు తగ్గడం, కోపం వంటివి కూడా డిప్రెషన్ లక్షణాలుగానే చెప్పుకోవచ్చు.డిప్రెషన్ కు గురైన వారు అస్సలు పడుకోలేకపోతుంటారు.లేదా ఎప్పుడూ నిద్ర పోతూనే ఉంటారు.ఏ పనిపైనా ఆసక్తి చూపరు.ప్రతి విషయాన్ని మరచిపోతుంటారు.అంతేకాదు, డిప్రెషన్‌లో ఉన్న వారికి ఆకలి ఉండదు.
ఒకవేళ ఉన్నా వేళకు ఆహారం తీసుకోరు.దాంతో అనేక అనారోగ్య సమస్యలు చుట్టేస్తాయి.
కాబట్టి, పైన చెప్పిన లక్షణాలు మీలో ఉంటే గనుక ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా మంచి మానసిక వైద్యుడిని సంప్రదించి కౌన్సిలింగ్ తీసుకోవాలి.లేదంటే డిప్రెషన్‌లో కూరుకుపోయి ఒక్కోసారి ప్రాణాలను తీసుకునే స్టేజ్ వారకు వెళ్లిపోతారు.