క్యాన్సర్‌లో ఎన్నో రకాలు ఉన్నాయి.అందులో గర్భాశయ క్యాన్సర్ ఒకటి.
ప్రస్తుత రోజుల్లో దీని బారిన పడుతున్న స్త్రీల సంఖ్య భారీగా పెరిగిపోతోంది.అలాగే ప్రతి సంవత్సరం గర్భాశయ క్యాన్సర్‌తో ఎందరో మహిళలు మృత్యు వాత పడుతున్నారు.
రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా ఉండటం, బర్త్ కంట్రోల్ పిల్స్‌ను ఓవర్‌గా యూజ్ చేయడం, ధూమపానం, మద్యపానం, ఒకరి కంటే ఎక్కువ మందితో శారీరక సంబంధం కలిగి ఉండటం, అపరిశుభ్రంగా వ్యవహరించడం వంటి రకరకాల కారణాల వల్ల గర్భాశయ క్యాన్సర్‌కు గురవుతుంటారు.కొందరికి వంశపారంపర్యంగా కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఏదేమైనప్పటికీ సరైన సమయంలో లక్షణాలను గుర్తించి వెంటనే చికిత్స తీసుకుంటే ఈ క్యాన్సర్ ను సులభంగా నివారించుకోవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం గర్భాశయ క్యాన్సర్‌ను సూచించే ప్రధాన లక్షణాలు ఏంటీ.? అసలు లక్షణాలను గుర్తించిన వెంటనే ఏం చేయాలి.? వంటి విషయాలపై ఓ లుక్కేసేయండి.
నెలసరి సరిగ్గా రాకపోవడం, నెలసరి సమయంలో అధిక రక్తస్రావం అవ్వడం, నెల మధ్యలో స్పాటింగ్ వంటివి గర్భాశయ క్యాన్సర్‌ను సూచించే ప్రధాన లక్షణాలుగా చెప్పుకోవచ్చు.

అలాగే తరచూ పొత్తి కడుపులో నొప్పి పుట్టడం, తీవ్రమైన నడుము నొప్పి, ఉన్నట్లుండి బరువు తగ్గి పోవడం, ఆకలి లేకపోవడం, అలసట, కాళ్ల వాపులు, మూత్రవిసర్జన చేసే సమయంలో నొప్పి వంటివి కూడా గర్భాశయ క్యాన్సర్ లక్షణాలే.
కాబట్టి, ఈ లక్షణాలు మీలో గనుక కనిపిస్తే ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే మీకు నమ్మకం ఉన్న మంచి గైనకాలజిస్ట్‌ను సంప్రదించి.వారు సూచించిన టెస్ట్‌లను చేయించుకోవాలి.
ఏం కాదులే అంటూ నిర్లక్ష్యం చేసి ఇంట్లోనే కూర్చుంటే క్యాన్సర్ మరింత ముదిరిపోయి.ప్రాణాంతకంగా మారుతుంది.
కనుక గర్భాశయంలో జరిగే మార్పులను ప్రతీ స్త్రీ ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి.