సుమారు మూడు సంవత్సరాల క్రితం బెంగుళూరులో ఒక విదేశీవ్యాపారి పోలీస్ స్టేషన్ లో ఓ ఫిర్యాదు చేసాడు .పదకొండు కేజీల తన వెంట్రుకల మూట డాబా మీద దాస్తే దొంగ వచ్చి ఎత్తుకుపోయాడని స్టేషన్ లో లబోదిబోమన్నాడు.
ఈ కేసు సంచలనం సృష్టించడంతో అన్ని కేసులు పక్కకు పెట్టిన పోలీసు ఆదరాబాదరా ఈ కేసుకోసం విచారించి అస్లాం అనే డ్రైవర్ దొంగని తేల్చారు .ఈ మూట ఎందుకు దొంగిలించావని పోలీసులు నిలదీస్తే పార్వతి అనే వెంట్రుకల వ్యాపారికి అమ్మి కుటుంబం గడుపుకుంటున్నాని తీరిగ్గా జవాబిచ్చాడు.వెంట్రుకలు దొంగిలించి అమ్మగా వచ్చిన లక్ష రూపాయిల డబ్బుతో కుటుంబం గడుపుకుంటున్నాని దొంగ నిజాయితీగా చెబితే …మన దేశంలో నాయకులు వెంట్రుక పదాలని నిస్సిగ్గుగా తమ స్వార్థ రాజకీయ విమర్శలకు వాడుకుంటున్నారు.వెంట్రుకలను నీచ భాషకు వాడుకుంటున్న కొందరు ప్రజాప్రతినిధులు , రాజకీయ నాయకుల వల్ల సమాజానికి ఏమి ఒరిగిందనేది పక్కకు పెడితే …నిజంగా వెంట్రుకలు మన దేశంతో పాటు కొన్ని దేశాల ఆర్ధిక పురోగతికి, కొన్ని లక్షల మంది జీవనోపాధికి దారి చూపుతున్నాయి.
ఈతరహా మేలు చేయని కొందరు నాయకులు తమ వెంట్రుకలు పీక లేరంటూ రాజకీయ తిట్లలో కొత్త పదజాలాన్ని గత కొంతకాలంగా వాడటం … నిజంగా వెంట్రుకలకు కూడా మనోభావాలు ఉండిఉంటే వెంట్రుక భాష వాడుతున్న ప్రజాస్వామ్యం లోని నేతలు సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్ధితి దాపురించేది.

మోడీ,బోడీ, ఈడీ నా వెంట్రుక కూడా పీకలేరన్నారు ఆ మధ్య తెలంగాణ మంత్రి కేటీఆర్ .తాజాగా ఆంధ్ర మంత్రి సిదిరి అప్పలరాజు మీ అండ ఉన్నంత కాలం నా వెంట్రుక కూడా పీకలేరంటూ సవాల్ విసురుతున్నారు.కేసులతో చంద్రబాబు గడ్డం మీద వెంట్రుకలు కూడా పీకలేరని సెలవిచ్చారు మాజీ మంత్రి నారా లోకేష్ .ఈఅన్నిటికీ మించి ఏపీలో ఓ మహిళామంత్రి మా జగనన్న వెంట్రుక కూడా పీకలేరు మరోసారి నాని గడ్డం మీద తెల్లవెంట్రుక కూడా పీకలేరని ఎలుగెత్తి చాటారు .ఇవి కొన్ని ఊదాహరణలు మాత్రమే .ఆఖరికి కేంద్రమంత్రుల మొదలాయితు ముఖ్యమంత్రులు , మాజీ ముఖ్యమంత్రులు వరకు వ్యాఫించి ఈ వెంట్రుకల భాష మండల స్ధాయి నేతల విమర్శల్లో కూడా ప్రథమ ప్రాధాన్యతగా మారి ఇదో తిట్టుపదంగా మార్చిపడేసేలా ఎవరికి వారు తలాపాపం తిలా పిడికెడు అన్న మాదిరిగా కృషిచేసారు , కృషి చేస్తునే ఉన్నారు .ప్రధానంగా ప్రజాస్వామ్య వ్యవస్ధలో నేతలకుండాల్సింది సద్విమర్శ.అందునా అధికార పక్షానికి ఉండాల్సింది సంయమనం.సద్విమర్శను స్వీకరించి సంస్కారవంతంగా మాట్లాడాల్సిన విధానం .గతంలో వారు అధికారంలో ఉన్నప్పుడు ఇదే భాష మాట్లాడారు కదా మేం మాట్లాడతాం అంటే ప్రజలు హర్షిస్తారా లేదా అన్నది వారు ఆత్మవిమర్శ చేసుకోవాలి.ప్రతిపక్షాలు కూడా గతంలో ఈ మాదిరిగా వ్యవహరించినందునే ప్రజలకు దూరమయ్యామనే భావన లేకుండా అదే పంథాలో పోతే జరిగే నష్టం పునారావృతం అవుతుందని గుర్తుంచుకోవాలి.

అసలు వెంట్రుకలనే ఆధారంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తున్న నాయకులు వెంట్రుకలకున్న విలువ , గొప్పతనం , దేశాల సౌభాగ్యంలో దాని ప్రగతి తెలిస్తే నోరు విప్పగలుగుతారా? వెంట్రుకపాటి విలువైన ప్రజలకు సేవ చేస్తున్నామా లేదా అన్నది నాయకులు ప్రశ్నించుకుంటే ముందు వెంట్రుక భాషను దాని అర్ధాన్ని అసభ్యంగా మార్చకుండా ఉంటారు .అత్యున్నత ప్రజాస్వామ్య వ్యవస్ధలో ఓటర్లు తమకిచ్చిన విలువైన అవకాశాన్ని సేవ రూపంలో వారు రుణం తీర్చుకోవాల్సిన సందర్భం ఉండాలే గానీ , నోటీ దురదతో ఇష్టానుసారం సమాజం హర్షించని రీతిలో నేతలు మాట్లాడటం ప్రజాస్వామ్యానికి గౌరవం కాదు .అధినాయకులే మాటాలను ఇష్టానుసారంగా దొర్లిస్తే కిందిస్ధాయి కేడర్ కు ఏం సంకేతం ఇస్తున్నామో నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలి .