సమస్యల చిక్కుల్లో సంక్షేమ హాస్టళ్లు చాలి చాలని మెస్ బిల్లులతో అర్ధాకలి కెవిపిఎస్ సర్వేలో విద్యార్థుల మొర సమస్యల చిక్కుల్లో సంక్షేమ హాస్టళ్లు నెలకొన్నాయని, చాలీచాలని మెస్ బిల్లులతో అర్ధాకలితో విద్యార్ధులు అలమటిస్తున్నారని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) జిల్లా ప్రధాన కార్యదర్శి నందిపాటి మనోహర్ ఆవేదన వ్యక్తం చేశారు.బుధవారం న కెవిపిఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన “సంక్షేమ హాస్టల్స్ బాట” కార్యక్రమం సందర్భంగా స్థానిక ఎన్నెస్పీ క్యాంపులోని ఎస్సీ బాలుర వసతి గృహాలైన బి, సి హాస్టల్స్ లతో పాటు ఆనంద నిలయాన్ని కెవిపిఎస్ ప్రతినిధుల బృందంతో సందర్శించి సమస్యలను అధ్యయనం చేశారు.
ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ ఒక్కొక్క విద్యార్థికి 33 రూపాయల 66 పైసలు, 8వ తరగతి లోపు విద్యార్థికి 30 రూపాయల చొప్పున ప్రభుత్వం మెస్ బిల్ ఇవ్వడంతో చాలీచాలని అర్ధాకలితో విద్యార్థులు అలమటిస్తున్నారని, పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు పెంచకపోవడంతో ప్రస్తుతం ఇస్తున్న ఈ డబ్బులతో పిల్లలు రెండు పూటల భోజనం ఎలా చేస్తారని ఆయన ప్రభుత్వాన్ని విమర్శించారు.సర్వేలో స్థానిక హాస్టల్లో అనేక సమస్యలు వెలుగులోకి వచ్చాయని హాస్టల్లో కనీసం దోమతెరలు కూడా లేకపోవడంతో సీజనల్ వ్యాధులకు విద్యార్థులు గురవుతున్నారని, సరి అయిన డ్రైనేజీ లేకపోవడంతో మురుగు కుంటలు ఏర్పడి దోమలకు నిలయాలుగా మారి విద్యార్థులు రోగాల బారిన పడుతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారని వారు ఆరోపించారు.
గతంలో లక్షల రూపాయలతో కాంట్రాక్టర్లు నిర్మించినటువంటి నాసిరకమైన ప్రహరి గోడ కూలిపోవడంతో పందులు, గేదలు, పాములు, కుక్కలు స్వైర విహారం చేస్తుండటంతో ప్రమాదపు అంచుల్లో అభద్రతాభావంతో బిక్కుబిక్కు మంటూ విద్యార్థులు పూటలు వెళ్లదీస్తున్నారాని వారు విమర్శించారు.ఈ మూడు హాస్టళ్లు కూడా ఒకటే క్యాంపస్ లో 287 మంది విద్యార్థులతో ఉన్నారని వారికి తాగటానికి కనీసం మినరల్ వాటర్ ప్లాంట్ సౌకర్యాన్ని అధికారులు కల్పించకపోవడం శోచనీయం అన్నారు.
ఈ యొక్క కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి బొట్ల సాగర్, జిల్లా ఉపాధ్యక్షులు మట్టి దుర్గా ప్రసాద్, నగర నాయకులు జెర్రిపోతుల కిరణ్, రాము హాస్టల్ విద్యార్థులు, సిబ్బంది తదితరులు వున్నారు.