VRAలు, ఉపాధ్యాయులు, సింగరేణి కాంట్రాక్టు కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం కోసం చలో అసెంబ్లీ కార్యక్రమం జరుపుతుంటే, వారిపై లాఠీచార్జి, అక్రమ అరెస్టులను నిరసిస్తూ సిపిఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఖమ్మం మయూరి సెంటర్లో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది.ఈ సందర్భంగా సిపిఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ ఖమ్మం జిల్లా కార్యదర్శి మందుల రాజేంద్రప్రసాద్, ఖమ్మం డివిజన్ కార్యదర్శి కోలా లక్ష్మీనారాయణ పాలేరు డివిజన్ కార్యదర్శి బజ్జూరి వెంకటరామిరెడ్డి పాల్గొని మాట్లాడారు.
గ్రామ రెవిన్యూ సహాయకులు(VRO) గత 52 రోజులుగా తమ సమస్యల పరిష్కారం కోసం నిరవధిక దీక్షలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కెసిఆర్ నిరంకుశత్వంగా వ్యవహరిస్తుందన్నారు.గ్రామ రెవిన్యూ సహాయకుల(VRA)పై ఇప్పటికే పనిభారం పెరిగిందన్నారు.
వారికి పేస్కేల్ విధానం తేవాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా నియమించాలని, మరణించిన వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని, అర్హులైన వారికి పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు.గతంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలుచేయాలని అన్నారు.
ఉపాధ్యాయులు తమ బదిలీలు తదితర సమస్యలపై అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రభుత్వానికి విన్నవించాలని వచ్చిన వారిపై లాఠీచార్జి, దాడి చేయడం అక్రమంగా అరెస్టు చేయడం దారుణం అన్నారు.
సింగరేణి కాంట్రాక్టు కార్మికులు తమను పర్మినెంట్ చేయాలని ప్రధాన డిమాండ్ తో నిరవధికంగా సమ్మె చేస్తున్నా పట్టించుకోకుండా వారిని అరెస్టు చేయడం దుర్మార్గం అన్నారు.
గత ఫిబ్రవరి లో సింగరేణి యాజమాన్యం హైదరాబాద్ లేబర్ కమీషనర్ ఇచ్చిన హామీలను అమలుచేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 9 నుండి కాంట్రాక్ట్ వర్కర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడి పిలుపునిచ్చారు.గ్రామ రెవిన్యూ సహాయకులు, ఉపాధ్యాయులు, కార్మికులు, ప్రజలు తమ హక్కుల సాధనకై సిపిఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందన్నారు.
తమ హక్కుల సాధనకై ఆత్మహత్య చేసుకున్న VRA ల కుటుంబాలను ఆదుకోవాలని, లేని పక్షంలో సిపిఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ప్రజా ఆందోళనలు తీవ్రతరం చేయాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.వెంటనే వారి సమస్యలను పరిష్కారం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ఖాసీం, డివిజన్ నాయకులు పాముల మోహనరావు, షేక్ సుభాన్, వివీరావు, రాజా,శ్రీకాంత్, సప్పిడి వెంకటేశ్వర్లు, శ్రీను, బద్రి, శంకర్ ,బుచ్చిబాబు, జాన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.







