సూర్యాపేట జిల్లా:గత 45 రోజులుగా వీఆర్ఏలు దీక్ష చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆరోపిస్తూ కోదాడ డివిజన్ పరిధిలో ఉన్న వీఆర్ఏలు కోదాడ పట్టణంలోని బైపాస్ రోడ్ నుండి స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.అనంతరం కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ కి వీఆర్ఏల డిమాండ్ల విషయంపై వినతిపత్రం అందజేయడానికి వెళ్లగా ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడంతో కొంతసేపు వేచి చూసి నినాదాలు చేస్తూ అక్కడి నుండి వెనుతిరిగారు.
ఈ సందర్భంగా పలువురు వీఆర్ఏ మాట్లాడుతూ వీఆర్ఏలు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని గత 45 రోజులుగా సమ్మె చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లుగా కూడా లేకపోవడం బాధాకరమన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ వీఆర్ఏలకు ఇచ్చిన హామీ,పే స్కేల్,55ఏళ్ళు నిండిన వీఆర్ఏల ఉద్యోగాలు వారి వారసులకు ఇవ్వాలనే డిమాండ్లను అమలు చేయాలని తాము చేస్తున్న నిరసన న్యాయమైనదని తెలిపారు.
ప్రభుత్వం తమ సమస్యలపై స్పందించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కోదాడ నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాలకు చెందిన విఆర్ఏలు పాల్గొన్నారు.