వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లుతున్నప్పుడు వాటి పైనుంచి దాటక పోవడమే మంచిది.కానీ కొంతమంది దీనివల్ల ఎంత రిస్క్ ఉందో తెలియకుండా ముందుకు సాగి చివరికి మృత్యువాత పడ్డారు.
ఇలాంటి ఘటనలు ప్రతి వర్షాకాలం భారతదేశంలో( India ) ఎన్నో నమోదవుతున్నాయి.వీటికి సంబంధించిన వీడియోలను న్యూస్ మీడియా విస్తృతంగా ప్రసారం చేస్తోంది.
వీటిని చూసైనా జనాలు నేర్చుకుంటారా అంటే అది జరిగేలా లేదు.తాజాగా మరో ముగ్గురు యువకులు ఉదృతంగా ప్రవహిస్తున్న నదిని దాటేందుకు ప్రయత్నించి చివరికి ప్రాణాపాయ స్థితిలో చిక్కుకున్నారు.
అదృష్టవశాత్తు వారు బయటపడగలిగారు.

వివరాల్లోకి వెళితే, ఉత్తరాఖండ్‌లోని అల్మోరాలో( Almora, Uttarakhand ) ముగ్గురు యువకులు తమ మహీంద్రా థార్ ( Mahindra Thar )వాహనంలో రామ్‌గంగా నదిని దాటడానికి ప్రయత్నించారు.అయితే, నదిలో నీటి మట్టం అధికంగా ఉండటంతో, వారి థార్ వెహికల్ మధ్యలోనే ఆగిపోయింది.ప్రాణాలను కాపాడుకోవడానికి, యువకులు చకచకా వాహనంపైకి ఎక్కారు.
ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఆ వీడియోలో, ముగ్గురు యువకుల్లో ఒకరు లైఫ్ జాకెట్ ధరించి ఉండటం మీరు గమనించవచ్చు.ఇతర ఇద్దరు యువకులు లైఫ్ జాకెట్ లేకుండా కనిపించారు.ఒడ్డున ఉన్న కొంతమంది ప్రజలు యువకులను గమనిస్తూ వారిని కాపాడడానికి సిద్ధమయ్యారు.
లైఫ్ జాకెట్ ధరించిన యువకుడు మొదట నదిలోకి దూకాడు.అయితే అత్యంత వేగవంతమైన ప్రవాహ ఉద్ధృతికి అతను కొంత దూరం కొట్టుకుపోయాడు.
వెంటనే ఒడ్డున ఉన్న వారు అతన్ని పట్టుకొని బయటికి తీసుకు రాగలిగారు.మిగతా ఇద్దరు యువకులు కూడా కొంత సమయం తర్వాత అతి కష్టం మీద ఉధృతంగా ప్రవహిస్తున్న నదిలో నుంచి ప్రాణాలతో బయటపడ్డారు.





 

