ఏపీలో రాజకీయ సమీకరణాలు శర వేగంగా మారిపోతున్నాయి.ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఒక పార్టీ నుంచి మరొక పార్టీలోకి వలసలు మొదలయ్యాయి.
రాబోయే ఎన్నికల్లో టిడిపి, జనసేన, బిజెపి వైసిపి బీఆర్ఎస్ ఇలా అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి.అలాగే పార్టీల మధ్య పొత్తుల వ్యవహారం పైన చర్చలు జరుగుతున్నాయి.
ఇదిలా ఉంటే బెజవాడ రాజకీయాల్లో కీలక పరిణామాలు ఇప్పుడు చోటు చేసుకోబోతున్నాయి.కాపు సామాజిక వర్గంలో మంచి గుర్తింపు ఉన్న దివంగత వంగవీటి మోహన్ రంగ తనయుడు , మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ టిడిపిని వీడి జనసేన లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

ఒకవైపు టిడిపి, జనసేన పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమవుతున్న సమయంలోనే రాధ జనసేన లో చేరాలని నిర్ణయించుకోవడం ఆసక్తి రేపుతోంది.గతంలో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యంలో రాధాకృష్ణ చేరారు.అప్పటి నుంచి పవన్ తో సన్నిహిత సంబంధాలు ఆయనకు ఉన్నాయి.వాస్తవంగా జనసేన లో రాధాకృష్ణ ఎప్పుడో చేరతారనే ప్రచారం జరిగింది.ఢిల్లీలో జనసేన నిర్వహించిన పార్టీ కీలక సమావేశంలోనూ రాధాకృష్ణ పాల్గొనడంతో, అప్పుడే ఆయన పార్టీ మారుతున్నారు అనే హడావుడి జరిగింది. అయితే ఇప్పుడు మాత్రం పవన్ నుంచి ఆహ్వానం అందడంతో పాటు, విజయవాడ సెంట్రల్ సీటు పైన స్పష్టమైన హామీ లభించడంతో రాధ జనసేన లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారట.

మార్చి14వ తేదీన జనసేన ఆవిర్భావ సభ జరగబోతుండడంతో, ఆ సభలోనే రాధ పవన్ సమక్షంలో జనసేనలో చేరుతారని తెలుస్తోంది.ఒకవేళ ఆరోజు కుదరని పక్షంలో, మార్చి 22న చేరేందుకు రాధ ఏర్పాట్లు చేసుకుంటున్నారట.అయితే టిడిపి , జనసేన పొత్తు కుదిరితే విజయవాడ సెంట్రల్ సీటు విషయంలో టిడిపి అభిప్రాయం ఎలా ఉంటుందనే దానిపైనే చర్చ జరుగుతుంది.అక్కడ నుంచి పోటీ చేసేందుకు టిడిపి కీలక నేత బొండా ఉమ సిద్ధమవుతుండడంతో, ఆయనను బాబు ఒప్పిస్తారా ప్రత్యామ్నాయంగా వేరే చోట ఆయనకు సీటు కేటాయిస్తారా అనేది తేలాల్సి ఉంది.