కళ్ల ముందే ఆత్మీయుల ప్రాణాలు పోవడం, ఉపాధి లేక రోడ్డున పడటం, కనీసం పక్కింటి వాళ్లతో కూడా మాట్లాడలేని పరిస్ధితుల్లో.ఈ మహమ్మారికి వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందిరా దేవుడా అని మనుషులు ఎదురుచూశారు.
టీకాను వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు శాస్త్రవేత్తలు రేయింబవళ్లు కష్టపడ్డారు.తీరా వ్యాక్సిన్ తీసుకొస్తే.
దానిని తీసుకునేందుకు ప్రజలు జంకుతున్నారు.ఈ విషయం ఎన్నో సర్వేల్లో తేలింది.
దీంతో టీకా పట్ల జనంలో వున్న అపోహలను తొలగించేందుకు పలు దేశాల అధినేతలు, ప్రముఖులు వ్యాక్సిన్‌ను పబ్లిక్‌గా వేయించుకున్నారు.ఇప్పటికే చాలా మంది తొలి డోసు కూడా తీసుకున్నారు.
ఈ క్రమంలో అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ మంగళవారం రెండో డోసును తీసుకున్నారు.నేషనల్ ఇన్స్‌టిట్యూట్స్ ఆఫ్ హెల్త్‌లో ఆమె టీకా వేసుకున్నారు.మోడెర్నా సంస్థకు చెందిన కోవిడ్ టీకా డోసులను కమలా హారిస్ తీసుకున్నారు.ఈ సందర్భంగా ఉపాధ్యక్షురాలు మీడియాతో మాట్లాడుతూ.
ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమాన్ని సీ స్పాన్ టీవీ ప్రత్యక్ష ప్రసారం చేసింది.
కాగా డిసెంబర్ 29న కమలా హారిస్ తొలి డోసు టీకాను తీసుకున్న సంగతి తెలిసిందే.వాషింగ్టన్‌లోని యునైటెడ్ మెడికల్ సెంటర్‌లో ఆమె ఆ టీకా వేయించుకున్నారు.

అమెరికాలో డిసెంబరులోనే వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది.ప్రారంభంలో నెమ్మదిగా సాగిన వ్యాక్సినేషన్.గత వారం రోజుల్లో వేగం పుంజుకుంది.ఇప్పటి వరకు 2,44,83,819 మందికి టీకా పంపిణీ చేశారు.జనవరి 20న అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన జో బైడెన్.తన తొలి 100 రోజుల పాలనలో 10 కోట్ల మంది అమెరికన్లకు టీకా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇప్పటికే 40 కోట్ల డోసుల కోసం కొనుగోలు ఒప్పందం చేసుకున్న అమెరికా మరో 20 కోట్ల డోసులకు ఆర్డర్ ఇచ్చేందుకు సిద్ధమైంది.ఇందుకోసం ఫైజర్, మోడెర్నా టీకాలను ఒక్కోటి 10 కోట్ల డోసుల చొప్పున కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.