కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా మిగిల్చిన విషాదం అంతా ఇంతా కాదు.లక్షలాది మంది ప్రాణాలను తీసుకోవడంతో పాటు అన్ని రంగాలను సంక్షోభంలోకి నెట్టి మానవాళి మునుపెన్నడూ చూడని దృశ్యాలను కళ్లముందు పెట్టింది.
కత్తికి రెండు వైపులా పదునున్నట్లు కోవిడ్ 19 మనిషిలో ఉన్న మానవత్వాన్ని తట్టిలేపింది.తోటి వ్యక్తి కూడా మనలాంటి వాడేనన్న సంగతిని గుర్తించిన ఎంతో మంది ఆపదలో ఉన్న వారిని ఆదుకున్నారు.
లాక్‌డౌన్ సమయంలో కొందరు మనసున్న మనుషులు నిత్యావసరాలు, వసతి, భోజనం, ఆర్ధిక సాయాలు అందించారు.
దీనిలో భాగంగా కరోనా మహమ్మారి సమయంలో అమెరికాలోని వాషింగ్టన్ డీసీ మెట్రో ప్రాంతంలో స్థిరపడిన భారతీయ అమెరికన్ సమాజం తన పెద్దమనసు చాటుకుంది.
యూఎస్‌లో కరోనా ఉద్ధృతి మొదలైన మే నెల నుంచి నేటి వరకు సుమారుగా 15 వేల కుటుంబాలకు నిత్యావసరాలు, ఆహారాన్ని అందించింది.కరోనా వైరస్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారికి ఆహారాన్ని అందించేందుకు గాను ‘‘ డ్రైవ్ త్రూ ఫుడ్’’ అనే ప్రోగ్రామ్‌లో భాగంగా సుమారు 250 కార్లను ఉపయోగించింది.
దీనిపై ఇండో అమెరికన్ సమాజానికి చెందిన డాక్టర్ సురేశ్ మాట్లాడుతూ.ఇప్పటి వరకు ఈ ప్రాంతంలోని కనీసం 15 వేల కుటుంబాలకు నిత్యావసర వస్తువులను సరఫరా చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ క్లిష్ట సమయంలో కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి తాము చేసిన చిన్న ప్రయత్నం వారికి చేయూతను అందించిందని సురేశ్ చెప్పారు.ఈ ఫుడ్ డ్రైవ్ కార్యక్రమంలో భారతీయ అమెరికన్ ప్రముఖులు, స్థానిక చర్చి, వాషింగ్టన్ డీసీ మెట్రో ప్రాంతంలోని కౌంటీ అధికారులు తలో చేయి వేశారు.
ఈ 250 కార్ల యజమానులు, వారి కుటుంబసభ్యులతో కలిసి ఆహారాన్ని సేకరించడం, పంపిణీ చేయడం వంటి విధులు నిర్వర్తించేవారు.ప్రధానంగా పేదరికంలో ఉన్న వారికి, ఆహారం లేక ఇబ్బంది పడుతున్న వారికి వాటిని అందజేసేవారు.
కష్టకాలంలో తమ కడుపునింపిన భారతీయ అమెరికన్ సమాజానికి పలువురు కృతజ్ఞతలు తెలియజేశారు.ఆహార పంపిణీకి సంబంధించిన వివరాలను భారతీయ అమెరికన్ ప్రతినిధులు స్థానిక ఎన్జీవోలు, ఫుడ్ బ్యాంకులకు, ప్రార్థనా మందిరాలకు అందజేసేవారు.
కాగా భారత జాతిపిత మహాత్మా గాంధీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 2 నుంచి దీపావళి వరకు ఫుడ్ డ్రైవ్ నిర్వహించాలని భారతీయ సమాజం భావిస్తోంది.