చదివిన చదువుకి చేసే ఉద్యోగాలకి పొంతన లేదు.చేసే ఉద్యోగాలు కూడా మూణ్నాల ముచ్చటే.
దాంతో పనిపాట లేకుండా తిరిగితే ఎలా అని కుటుంబసభ్యులు ప్రశ్నించడంతో ఉద్యోగవేటలో పడ్డాడో నిరుద్యోగి.అతగాడి చరిత్ర తెలిసిన యాజమాన్యం ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించడంతో ఎయిర్పోర్ట్ లో బాంబ్ ఉందని భయపెట్టాలనుకున్నాడు,చివరికి కటకటాల పాలయ్యాడు.

ఉడుపి జిల్లా మణిపాల్‌కు చెందిన ఆదిత్య రావు ఇంజినీరింగ్ చదివాడు.అంతేకాదు ఎంబీఏ కూడా పూర్తి చేశాడు.తర్వాత కొన్నాళ్లు ప్రైవేటు బ్యాంకుల్లో చిన్నచిన్న కొలువులు చేశాడు.ఎక్కడా స్థిరంగా పనిచేసే రకం కాదు.ఉద్యోగంలో జాయిన్ అవ్వడం కొద్ది రోజులు చేసి మానేయడం ఇదీ ఆదిత్య తీరు…ఆఖరికి ఒక మఠంలో వంటవాడిగా కూడా ఉద్యోగం వెలగబెట్టాడు.దానికీ ఎగనామం పెట్టి ఇంటికొచ్చాడు.
‘పనీపాటా లేకుండా ఊరికే తిని కూర్చునే వారిని చూస్తే ఒకట్రెండు రోజులు ఊరుకుంటారు ఎవరైనా.తర్వాత ఇదేం పద్ధతి అని అడుగుతారు.
వినకపోతే కోప్పడతారు.అదే పని ఆదిత్య కుటుంబ సభ్యులు చేశారు.
దాంతో పౌరుషంగా ఇంట్లోంచి వెళ్లిపోయాడు.బెంగళూరు చేరాడు.
ఎయిర్‌పోర్టులో సెక్యూరిటీ గార్డ్ కొలువులు ఉన్నాయని తెలిసి దరఖాస్తు చేసుకున్నాడు.ఇక్కడే కథ అడ్డం తిరిగింది.

అతని చరిత్రను ఆరా తీసిన రిక్రూట్‌మెంట్ అధికారులు జాబ్ ఇవ్వడం కష్టమని రిజెక్ట్ చేశారు.అయినా రెండోసారి ప్రయత్నించాడు.అప్పుడు కూడా జాబ్ రాలేదు.దీంతో కక్ష పెంచుకున్న ఆదిత్య ఎయిర్‌పోర్ట్ అధికారులకు ఫోన్ చేసి ఎయిర్ పోర్ట్లో ఎవరో బాంబు పెట్టారని చెప్పేసి టక్కున ఫోన్ పెట్టేశాడు.
అధికారులు వెంటనే తనిఖీ చేయగా, బాంబు దొరకలేదు.పగ తీరన ఆదిత్య వారం తర్వాత మళ్లీ ఫోన్ చేసి… ఈసారి ఎయిర్‌పోర్ట్‌తో పాటూ కేఎస్‌ఆర్ రైల్వే స్టేషన్‌లోనూ బాంబులు పెట్టారని భయపెట్టాడు.
తనిఖీల్లో అవి దొరకలేదు.తమను ఎవరో ఆటపట్టిస్తున్నారని భావించిన పోలీసులు ఫోన్ కాల్స్ ఆధారంగా ఆదిత్యను పట్టకున్నారు.ఎయిర్‌పోర్టులో తనకు కొలువు ఇవ్వనందుకు కసితో ఈ పని చేశానని ఒప్పుకున్నాడు ఈ జులాయి.







