దుబాయ్ ఎయిర్‌పోర్టులో భారతీయుల అవస్థలు: పట్టించుకోని భారత్.. నేనున్నానన్న యూఏఈ

కరోనా కారణంగా అన్ని దేశాల్లో ఎక్కడికక్కడ లాక్‌డౌన్‌లు, రాకపోకలు నిలిచిపోవడంతో ఎక్కడివారు అక్కడే గప్‌చుప్.దీని ప్రభావం భారతీయులపై బాగా పడింది.

విద్య, ఉపాధి తదితర కారణాలతో ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది భారతీయులు వివిధ దేశాల్లో చిక్కుకుపోయారు.ఈ క్రమంలో సొంత దేశానికి వెళ్లే మార్గం లేక ఎంతోమంది ఇండియన్స్ విమానాశ్రయాల్లోనే బిక్కుబిక్కుమంటున్నారు.

యూరప్ నుంచి పలువురు భారతీయులు ఈ నెల 18న దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు.అయితే అప్పటికే భారత ప్రభుత్వం అన్ని అంతర్జాతీయ సర్వీసులను రద్దు చేయడంతో 22 మంది భారత పౌరులు అక్కడే చిక్కుకుపోయారు.

వీరిలో పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్ వాసులు వున్నట్లుగా తెలుస్తోంది.తమను ఆదుకోవాల్సిందిగా కేంద్ర విదేశాంగ శాఖకు మొరపెట్టుకున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం కూడా ఏమి చేయలేని స్థితిలో ఉంది.

Advertisement

దిక్కుతోచని స్థితిలో ఉన్న వీరందరినీ ఆదుకునేందుకు యూఏఈ ప్రభుత్వం ముందుకు వచ్చింది.

భారతీయులతో పాటు ఇక్కడ చిక్కుకుపోయిన విదేశీయుల క్షేమ సమాచారాన్ని దుబాయ్ ఎయిర్‌పోర్ట్ వర్గాలు ఎప్పటికప్పుడు ఆయా దేశాల రాయబార కార్యాలయాలకు అందజేస్తున్నాయి.తమ దేశస్తులను స్వదేశానికి రప్పించడానికి భారతదేశ ప్రభుత్వం ఇంకా అనుమతి ఇవ్వకపోవడంతో ప్రస్తుతం తాము యుఏఈ ప్రభుత్వంతో కలిసి వీరి వసతి ఏర్పాట్లను చూస్తున్నట్లు దుబాయ్‌లోని భారత కాన్సుల్ జనరల్ విపుల్ అన్నారు.వీరు యూరప్‌లోని లిస్బన్, బుడాపెస్ట్, బార్సిలోనాతో పాటు సిడ్నీ నుంచి వచ్చి దుబాయ్‌లో ఎయిర్‌పోర్టులో చిక్కుకుపోయారని విపుల్ చెప్పారు.

కాగా కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 30,000కు చేరువలో ఉంది.నిన్నటి వరకు 5,47,034 మందికి వైరస్ సోకింది.భారత్‌లోనూ కరోనా కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి.

శుక్రవారం నాటికి మనదేశంలో 871 మందికి కోవిడ్ 19 సోకగా, 21 మంది మరణించారు.

పాకిస్థానీ మహిళను ఉద్యోగం నుంచి తీసేసిన టెస్లా.. ఆ షాక్‌తో..??
Advertisement

తాజా వార్తలు