అక్రమ మార్గాల్లో అమెరికాలో అడుగుపెట్టాలని భావించేవారి సంఖ్య నానాటికీ పెరుగుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే అక్కడి బోర్డర్ సెక్యూరిటీ, ఇమ్మిగ్రేషన్ అధికారులకు చిక్కి జైల్లో మగ్గుతున్న వారి సంఖ్య తక్కువేం కాదు.
అలాగే సాహసాలు చేసి ప్రాణాలు పొగొట్టుకునేవారు ఇటీవలి కాలంలో పెరుగుతున్నారు.గతేడాది జనవరిలో అమెరికా- కెనడా సరిహద్దుల్లో నలుగురు భారతీయులు అతి శీతల వాతావరణ పరిస్ధితులను తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
ఈ ఘటన డాలర్ డ్రీమ్స్‌పై మన వారికి వున్న వ్యామోహాన్ని తెలియజేస్తోంది.ఎలాగైనా అమెరికా చేరుకోవాలనుకున్న వారి ఆశల్ని మృత్యువు ఆవిరి చేసింది.
ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నా.మనదేశంలోని యువత అక్రమ మార్గాల్లో అమెరికాకు వెళ్లే ప్రయత్నాలను మాత్రం మానడం లేదు.
తాజాగా కెనడా నుంచి పడవ ద్వారా అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించిన ఐదుగురు వలసదారులను సరిహద్దు అధికారులు అరెస్ట్ చేశారు.వీరిలో ఇద్దరు భారతీయులు కూడా వున్నారు.మిచిగాన్ రాష్ట్రంలోని అల్గోనాక్ సమీపంలో యూఎస్ బోర్డర్ పెట్రోల్ ఏజెంట్లు వీరిని అరెస్ట్ చేసినట్లు యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.ఫిబ్రవరి 20వ తేదీ అర్ధరాత్రి రిమోట్ వీడియో నిఘా వ్యవస్థ ద్వారా పహారా కాస్తోన్న పెట్రోలింగ్ అధికారులు సెయింట్ క్లెయిర్ నదిపై ప్రయాణిస్తున్న గుర్తు తెలియని ఓడను గుర్తించి సిబ్బందిని అప్రమత్తం చేశారు.
ఏజెంట్లు స్పందించి వెంటనే ఆ పడవను చుట్టుముట్టారు.అనంతరం ఆ ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.తాము కెనడా నుంచి బోటు ద్వారా సరిహద్దు దాటేందుకు యత్నించినట్లు వారు అంగీకరించారు.అత్యంత శీతల ఉష్ణోగ్రత కారణంగా ఇద్దరు వలసదారులు పూర్తిగా తడిసిపోయి వణుకుతున్నట్లు ఏజెంట్లు గమనించారు.
అయితే వీరు పడవలోంచి తప్పించుకునే యత్నంలో నదిలో దూకినట్లు అధికారులకు నిందితులు తెలిపారు.అరెస్ట్ అయిన వారిలో ఇద్దరు భారతీయులు కాగా.మిగిలిన వారిని నైజీరియా, మెక్సికో, డొమినికన్ రిపబ్లిక్‌లకు చెందిన వారిగా గుర్తించారు .అక్రమంగా అమెరికాకు చేర్చేందుకు రాత్రి వేళలు, గడ్డకట్టే ఉష్ణోగ్రత వంటి ప్రతికూల వాతావరణ పరిస్ధితులను ఈ ముఠా సభ్యులు తమకు అనుకూలంగా మార్చుకున్నారని అధికారులు పేర్కొన్నారు.వీరందరినీ తదుపరి విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.