మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలంటూ పదే పదే పార్టీ నాయకులకు టిఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ సూచనలు చేస్తూ అలర్ట్ చేస్తున్నా… అక్కడ పార్టీ పరిస్థితి ఆశించినంత స్థాయిలో లేదని, టిఆర్ఎస్ కంటే బిజెపి వ్యూహాత్మకంగా ముందుకు వెళుతుందనే విషయాన్ని కేసిఆర్ ఆలస్యంగా గుర్తించారు. స్థానిక నాయకులు, మునుగోడు గెలుపు బాధ్యతలు తీసుకున్న వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విషయంపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
ఈ ఎన్నికల్లో గెలవడం ద్వారా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపునకు పునాది వేసుకోవాలని కెసిఆర్ భావిస్తున్నారు.అందుకే ఈ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టడంతో పాటు , ప్రభుత్వంపై ఎక్కడా అసంతృప్తి కలవకుండా అనేక ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ప్రస్తుతం మునుగోడు నియోజకవర్గంలో ఉన్న ఓటర్లు ఎంతమంది ? ఇక్కడి ఓటర్లలో ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు ఎంతమంది ? వారు ఎన్నికల సమయంలో ఓటు వేసేందుకు వస్తారా రారా ? వస్తే ఏ పార్టీకి అనుకూలంగా ఓటు వేస్తారు ? వీరిని రప్పించాలంటే ఎవరిని రంగంలోకి దించాలి ? ఇలా అనేక అంశాలపై సమగ్రంగా ఆరా తీస్తున్నారు.
దీంతో పాటు తమ రాజకీయ ప్రత్యర్ధులు గా ఉన్న బిజెపి అనుసరిస్తున్న వ్యూహాలపైనా కెసిఆర్ నివేదికలు తెప్పించుకుంటున్నారు.
అయితే ఈ నివేదికల్లో బిజెపితో పోలిస్తే టీఆర్ఎస్ వెనుకబడి ఉందనే విషయాన్ని కేసిఆర్ గుర్తించడంతో, నియోజకవర్గ బాధ్యతలు చూస్తున్న ఇన్చార్జిలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.మునుగోడు నియోజకవర్గంలో చోటుచేసుకుంటున్న ప్రతి చిన్న రాజకీయ అంశం పైన సమగ్రంగా నివేదికలు తెప్పించుకుంటున్నారు.

పార్టీ నాయకులు క్షేత్రస్థాయిలో పనిచేయకుండా హడావుడి చేస్తున్నారనే విషయాన్ని గుర్తించిన కేసీఆర్ ప్రభుత్వ , ప్రైవేటు నిఘా సంస్థలను రంగంలోకి దించి పూర్తిస్థాయిలో ఈ నియోజకవర్గ పరిస్థితులను ఆరా తీస్తున్నారు.ఇటీవలే హైదరాబాదుకు వలస వెళ్లిన ఈ నియోజకవర్గానికి చెందిన కీలక నాయకులతో బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశం నిర్వహించడం, ఈ సమావేశానికి భారీ గా జనాలు హాజరు కావడం తో ఈ విషయంలో తాము వెనకబడ్డామని, బిజెపి కంటే ముందుగా ఈ తరహా సమావేశాన్ని నిర్వహించడంలో ఈ నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు చూస్తున్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి, అలాగే టిఆర్ఎస్ అభ్యర్థిగా ప్రచారం జరుగుతున్న కూసుకుంట్ల ప్రభాకర్ కానీ సభను నిర్వహించకపోవడం పై కేసిఆర్ అసంతృప్తిగా ఉన్నారట . ఈ క్రమంలోనే ఇంటిలిజెన్స్ బృందాలను పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గంలోకి రంగంలోకి దింపినట్టు సమాచారం.