గ్రేటర్ హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగి రెండు నెలలు పూర్తి అయ్యింది.ఆ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్ధులు ప్రమాణ స్వీకారం కూడా ఇంకా చేయలేదు.
అదీగాక ఇంత వరకు జీహెచ్‌ఎంపీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎవరన్న విషయాన్ని రహస్యంగా దాచారు.ఇక ఈ ఉత్కంఠకు ముగింపు పలికే రోజు వచ్చింది.
అదేనండి ఈ నెల 11న జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం జరుగనుంది.అదే రోజు కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఆ తర్వాత బల్దియా మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు నిర్వహించనున్నారు.
ఈ నేపధ్యంలో జీహెచ్‌ఎంపీ ప్రధాన కార్యాలయం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసుశాఖ తెలిపింది.
కాగా ఫిబ్రవరి 11 న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని అధికారులు వెల్లడిస్తున్నారు.ఈ క్రమంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకొని, పోలీసులకు సహకరించాలని ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేశారు.
ఇకపోతే మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక నేపథ్యంలో ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు అవుతున్న సందర్బంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసులు అధికారులు వెల్లడిస్తున్నారు.ఇందుకోసమే ట్రాఫిక్ ఆంక్షలను విధించామని పేర్కొంటున్నారు.