సోయా చిక్కుడు పంట( Soyabean Cultivation ) సాగు చేయడం వల్ల నేల భూసారం పెరుగుతుంది.రైతులు ఎక్కువగా ఈ సోయాచికుడు పంటను వర్షాధార పంటగా సాగు చేస్తున్నారు.
నీటి వసతి తక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ పంటను సాగు చేసి మంచి దిగుబడులు సాధించవచ్చు.ఇతర పంటలతో పోలిస్తే శ్రమతో పాటు పెట్టుబడి వ్యయం చాలా తక్కువ.
సోయా చిక్కుడు పంట సాగుకు నల్ల రేగడి నేలలు, తేమ ఎక్కువగా ఉండే బరువైన నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి.జూన్ మొదటి వారం నుంచి జూలై మొదటి వారం వరకు సోయాచిక్కుడు పంట విత్తుకోవడానికి చాలా అనుకూలమైన సమయం.
సోయా చిక్కుడు వేసే నేలలో ముందుగా లోతు దుక్కులు దున్నుకొని, ఆఖరి దుక్కిలో ఒక ఎకరాకు నాలుగు టన్నుల పశువుల ఎరువు, 25 కిలోల యూరియా, 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్, 25 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను వేసి పొలాన్ని కలియ దున్నుకోవాలి.ఇక విత్తనం విత్తడానికి ముందు నేల వదులు అయ్యేలా రెండు లేదా మూడుసార్లు దున్నుకోవాలి.
సోయచిక్కుడు పంటలో విత్తన ఎంపిక అత్యంత కీలకం.మొలకశాతం ఎక్కువగా ఉన్న నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకోవాలి.ఆ తర్వాత విత్తనాలను( Seeds ) విత్తన శుద్ధి చేసుకోవాలి.ఒక కిలో విత్తనాలను మూడు గ్రాముల కాప్టన్ తో విత్తన శుద్ధి చేసుకోవాలి.ఇక మొక్కల మధ్య ఎనిమిది సెంటీమీటర్ల దూరం, మొక్కల వరుసల మధ్య 40 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు విత్తుకుంటే మొక్కలు ఆరోగ్యకరంగా పెరుగుతాయి.
సోయా చిక్కుడు పంటలో కలుపు నివారణ( Weeds ) కోసం విత్తనం విత్తుకున్న 48 గంటల్లోపు ఒక లీటరు నీటిలో ఐదు మిల్లీలీటర్ల పెండిమిథాలిన్ కలిపి నేల బాగా తడిచేలాగా పిచికారి చేయాలి.సోయా చిక్కుడు మొక్కలు ఎదుగుతున్న సమయంలో గుంటక లేదంటే గొర్రుతో అంతర కృషి చేసి కలుపు నిర్మూలించాలి.అంతర కృషి చేపట్టడం వల్ల మొక్క యొక్క మొదలుకు మట్టి ఎగదోయ్యబడుతుంది దీంతో మొక్క బలంగా తయారవుతుంది.
ఇక నేలలోని తేమ శాతాన్ని బట్టి 15 రోజులకు ఒకసారి నీటి తడులు అందించడంతో పాటు పంటకు ఏవైనా తెగుళ్లు లేదంటే చీడపీడలు ఆశిస్తే వెంటనే సంరక్షణ చర్యలు చేపట్టి పంటను సంరక్షించుకోవాలి.