మునుగోడు ఉప ఎన్నికలు వాడీవేడీగా జరుగుతున్నాయి.ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ అభ్యర్థులు, నాయకులు ఇప్పటికే మునుగోడు నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రచారం జరుపుతున్నారు.
రాజకీయ నాయకులు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేస్తూ ముందుకు సాగుతున్నారు.దీంతో మునుగోడు ఉపఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి.
తాజాగా బీజేపీ నేత కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి టీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు.మంత్రి కేటీఆర్, మంత్రి హరీశ్ రావు మునుగోడు ఎన్నికల్లో ప్రజలను తనపై ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు.
ప్రజలను తనపై దాడికి ఉసిగొల్పుతూ శునకానందం పొందుతున్నారని మండిపడ్డారు.
టీఆర్ఎస్ నేతలు ఎన్నికల ప్రచారంలో భాగంగా మునుగోడు ప్రజలకు మద్యం, మాంసం పంచుతున్న వీడియోను రాజగోపాల్ రెడ్డి ట్విట్టర్‌లో షేర్ చేశారు.
అయితే పురుషులతోపాటు మహిళలు కూడా మద్యం పంచుతుండటం వైరల్‌గా మారింది.ఈ వీడియోలో క్యూలో ఉన్న ప్రజలకు ఓ టీఆర్ఎస్ నేత మద్యం పంచుతున్నట్లు వీడియోలో ఉంది.
కాగా, గత కొద్ది రోజులుగా మునుగోడు ఎన్నికల ప్రచారంలో రాజగోపాల్ రెడ్డిపై ప్రజలు వ్యతిరేకత కనబరుస్తున్నారు.ఈ క్రమంలో టీఆర్ఎస్ నేతలు ప్రజలను మద్యం, డబ్బులు పంచి తనపై ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు.

కాగా, మునుగోడు ఎన్నికలను బీజేపీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.పదవికి రాజీనామా చేసి, బీజేపీలోకి చేరి ఎన్నికలు సృష్టించిన రాజగోపాల్ రెడ్డికి ఈ ఎలక్షన్స్ ఎంతో కీలకం.ఈ క్రమంలో ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలని అనుకుంటున్నారు.అందుకే ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే ప్రచారం మొదలు పెట్టారు.అయితే ప్రచారం సమయం తుది దశకు చేరుకుంది.ఈ కీలక సమయంలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి అనారోగ్యానికి గురయ్యాడు.
దీంతో బీజేపీ కార్యకర్తల్లో ఆందోళన మొదలైంది.జ్వరం కారణంగా నేడు రాజగోపాల్ రెడ్డి ప్రచారంలో పాల్గొనట్లు బీజేపీ నేతలు తెలిపారు.