తెలంగాణ కాంగ్రెస్ లో గ్రూప్ రాజకీయాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.సొంత పార్టీ నాయకుల పైనే ఎప్పుడు అసంతృప్తి వ్యక్తం చేస్తూ సీనియర్ నాయకులు వార్తల్లో ఉంటూ వస్తున్నారు.
తెలంగాణ ఆవిర్భావం తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కు చెందిన పార్టీ నాయకుల వైఖరి లో ఏ మాత్రం మార్పు కనిపించడం లేదు. 2023 లో జరగబోయే ఎన్నికల్లో దాదాపు ఇదే పరిస్థితి తలెత్తుతుంది అనే టెన్షన్ పార్టీ నాయకుల్లో కనిపించడంలేదు.
ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నాయకత్వం ను తాము ఒప్పుకునేది లేదు అన్నట్లుగా సీనియర్ నాయకులు వ్యవహారాలు చేస్తుండడం వంటివి నిత్యం తలనొప్పిగా మారాయి.ఈ విషయంలో అధిష్ఠానం సైతం విసిగిపోయినట్టు గానే కనిపిస్తోంది.
అందుకే సీనియర్ నాయకులు రేవంత్ కు వ్యతిరేకంగా ఎన్ని లేఖలు రాసినా, ఎన్ని ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకోనట్టు గా వ్యవహరిస్తోంది .
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు కొంతమంది రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను కలిసేందుకు ఢిల్లీకి వెళ్లారు.అక్కడ సోనియా, రాహుల్ మిగతా కాంగ్రెస్ సీనియర్ నాయకులు అపాయింట్మెంట్ కోసం ఎంతగా ప్రయత్నించినా, వారికి అపాయింట్మెంట్ దొరకలేదు.అంతేకాదు పార్లమెంట్ ఆవరణలో సోనియాను కలిసేందుకు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రయత్నాలు చేసినా, ఫలితం కనిపించలేదు.
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ఓటమి చెందడంతో, ఇక పై మిగతా రాష్ట్రాల్లో పార్టీ నాయకుల మధ్య గ్రూపు రాజకీయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించకూడదు అని కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలు నిర్ణయించుకోవడం తోనే, రేవంత్ రెడ్డి పై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులకు అపాయింట్మెంట్ దక్క పోవడానికి కారణమట.

అంతేకాకుండా కాంగ్రెస్ సీనియర్ నేతలు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా రాస్తున్న లేఖల పైన రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ అధిష్టానం ఎప్పటికప్పుడు చర్చిస్తూ ఉండడంతో, సీనియర్ నాయకుల వ్యవహారానికి పులిస్టాప్ పడుతోంది.ఇక ముందు ముందు సీనియర్ నాయకులు ఎంతగా రచ్చ చేసినా రేవంత్ విషయంలో మాత్రం అధిష్టానం పట్టించుకోనట్లు వ్యవహరించాబోతోంది అనే విషయం అర్థం అవుతోంది.ఈ విధంగా రేవంత్ సీనియర్ నాయకుల పై పట్టు సాధించినట్లుగానే కనిపిస్తున్నారు.







