ఇండియన్ సైంటిస్టుల సత్తా.. స్పేస్‌లో డాకింగ్ ప్రయోగం సక్సెస్.. ఎలైట్ క్లబ్‌లో భారత్!

అంతరిక్ష రంగంలో మనదేశం మరో మెట్టు ఎక్కింది.ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) శాస్త్రవేత్తలు చరిత్ర సృష్టించారు.

అంతరిక్షంలో రెండు ఉపగ్రహాలను ఒకదానితో మరొకటి కలిపే (డాకింగ్) సంక్లిష్టమైన ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేశారు.దీంతో ఈ ఘనత సాధించిన ప్రపంచ దేశాల సరసన భారత్ నిలిచింది.

అమెరికా, రష్యా, చైనా తర్వాత ఈ అరుదైన విజయాన్ని సొంతం చేసుకున్న నాలుగో దేశంగా మన భారత్ గర్వంగా నిలుస్తోంది.ఈ చారిత్రాత్మక ప్రయోగానికి స్పేస్ డాకింగ్ ఎక్స్‌పెరిమెంట్ (SpaDeX) అని పేరు పెట్టారు.

ఇందులో భాగంగా SDX01 (ఛేజర్), SDX02 (టార్గెట్) అనే రెండు ఉపగ్రహాలను 2024, డిసెంబర్ 30న పీఎస్‌ఎల్‌వీ సీ60 రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపారు.బెంగళూరులోని ఇస్రో మిషన్ ఆపరేషన్స్ కాంప్లెక్స్ (MOX) నుంచి శాస్త్రవేత్తలు ఈ మొత్తం ప్రక్రియను పర్యవేక్షించారు.

Advertisement

వారి సూచనల మేరకు ఈ రెండు ఉపగ్రహాలు అంతరిక్షంలో ఒకదానితో మరొకటి కలుసుకున్నాయి.డాకింగ్ ప్రక్రియను వివరిస్తూ ఇస్రో ఎక్స్‌లో ఒక పోస్ట్ చేసింది.

"డాకింగ్ విజయవంతంగా పూర్తయింది.చేజర్ ఉపగ్రహం టార్గెట్ ఉపగ్రహం నుంచి 15 మీటర్ల దూరం నుంచి 3 మీటర్ల దూరానికి కదిలింది.

ఆ తర్వాత డాకింగ్ ప్రక్రియ మొదలైంది, అది ఎంతో కచ్చితత్వంతో పూర్తయింది.డాకింగ్ తర్వాత, ఉపగ్రహాలు వెనక్కి తగ్గి స్థిరంగా ఉండేలా చేశారు" అని పేర్కొంది.

ఇస్రో సాధించిన ఈ విజయం మన దేశ అంతరిక్ష ప్రయాణంలో ఒక ముఖ్యమైన ముందడుగు.భవిష్యత్తులో చంద్రుడిపైకి మనుషులను పంపడం, ఇతర గ్రహాల నుంచి నమూనాలను తీసుకురావడం, సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించడం వంటి సంక్లిష్టమైన ప్రయోగాలకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ ప్రయోగం ద్వారా భారత్ నిరూపించుకుంది.అంతేకాదు, ఈ స్పేడెక్స్ మిషన్‌లో భాగంగా డాకింగ్ అయిన రెండు ఉపగ్రహాల మధ్య విద్యుత్ శక్తిని బదిలీ చేసే పరీక్షను కూడా నిర్వహించారు.

ఈ ఏడాది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలివే.. ఈ సినిమాలు హిట్టవుతాయా?
రెప్పపాటులో 20లక్షలు హుష్‌ కాకి.. వీడియో వైరల్

రోబోటిక్ వ్యవస్థలు, కలిసి పనిచేసే అంతరిక్ష నౌకలు, విడిపోయిన తర్వాత పేలోడ్‌ల వినియోగం వంటి భవిష్యత్ ప్రయోగాలకు ఈ సామర్థ్యం చాలా కీలకం కానుంది.

Advertisement

డాకింగ్ పూర్తయిన తర్వాత, ఈ రెండు ఉపగ్రహాలు ఒకే వ్యవస్థగా పనిచేస్తున్నాయని ఇస్రో ధృవీకరించింది.ఇకపై, ఈ ఉపగ్రహాలను వేరు చేసి మరిన్ని పరీక్షలు చేయనున్నారు.తర్వాత, ఈ రెండు ఉపగ్రహాలు విడివిడిగా తమ పేలోడ్‌లతో దాదాపు రెండు సంవత్సరాల పాటు పనిచేస్తాయి.

వాస్తవానికి ఈ డాకింగ్ ప్రయోగం జనవరి 7న జరగాల్సి ఉంది.కానీ, ఉపగ్రహాల మధ్య ఎక్కువగా డ్రిఫ్ట్ (దూరం పెరగడం) వంటి ఊహించని సమస్యల వల్ల రెండుసార్లు వాయిదా పడింది.

అయితే, ఇస్రో శాస్త్రవేత్తలు పట్టువదలని విక్రమార్కుల్లా ఈ సమస్యలను అధిగమించి, చివరకు ఈ విజయాన్ని సాధించారు.ఇది ఇస్రోకు, భారతదేశ అంతరిక్ష పరిశోధనలకు ఒక గొప్ప మైలురాయి అని చెప్పవచ్చు.

తాజా వార్తలు