హైదరాబాద్ నగరంలోని హైటెక్ సిటీలో ఓ సాఫ్ట్వేర్ కంపెనీ శిక్షణతో పాటు ఉద్యోగం ఇస్తామని నిరుద్యోగుల నుంచి కోట్ల రూపాయలు కాజేసీ చివరికి బోర్డు తిప్పేయడంతో ఉద్యోగులంతా రోడ్డున పడ్డారు.గత కొంతకాలంగా సరిగ్గా జీతాలు ఇవ్వకుండా రాత్రికి రాత్రే బోర్డు తిప్పేయడంతో తాము మోసం పోయామని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వివరాల్లోకెళితే.ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రాంతానికి చెందిన బిజినేపల్లి ప్రేమ్ ప్రకాష్( Prem Prakash ) (44) కొన్నేళ్ల క్రితం హైదరాబాదులోని సనత్ నగర్ లో నివాసం ఉంటూ తన స్నేహితుడైన లిఖిత్ తో కలిసి కొండాపూర్ వెస్ట్రన్ పెరల్ భవనంలో( Western Pearl Building ) సంటూ సూ ఇన్నోవేషన్స్ పేరిట ( Soo Innovations )ఓ ఐటీ కంపెనీ ప్రారంభించాడు.తమ కంపెనీలో శిక్షణ ఇచ్చి అనంతరం ఉద్యోగం కల్పిస్తామని ప్రచారం చేసి ఒక్కొక్క నిరుద్యోగి దగ్గర రూ.లక్ష నుండి రూ.లక్షన్నర వరకు డబ్బులు వసూలు చేసుకున్నాడు.నిరుద్యోగులు సొమ్ము చెల్లించి కంపెనీలో చేరిన తర్వాత వారికి రెండు నెలలు జీతాలు ఇచ్చి ఆ తర్వాత ఏవో మాటలు చెబుతూ కాలం గడుపుతున్నారు.

ఐటీ కంపెనీ నిర్వహకులైన ప్రేమ్ ప్రకాష్, లిఖిత్ నుంచి సరైన స్పందన లేకపోవడంతో కంపెనీలో పనిచేసే ఉద్యోగులంతా ఆదివారం పోలీసులను ఆశ్రయించారు.పోలీసులు ప్రేమ్ ప్రకాష్, లిఖిత్ లను అదుపులోకి తీసుకొని విచారించగా.దాదాపుగా రూ.3 కోట్ల రూపాయలను నిరుద్యోగుల నుండి వసూలు చేసినట్లు పోలీసులు విచారణలో బయటకు వచ్చింది.అకస్మాత్తుగా కంపెనీ ఇలా బోర్డు తిప్పడం వల్ల 100కు పైగా ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ఇలాంటి మోసపూరిత కంపెనీల పట్ల నిరుద్యోగులు చాలా అప్రమత్తంగా ఉండాలని, నిరుద్యోగులను వలలో వేసుకొని మోసం చేయడమే కొన్ని కంపెనీలు లక్ష్యంగా పెట్టుకున్నాయని పోలీసులు సూచిస్తున్నారు.







