ఓ ఆరేడేళ్ల క్రితం వరకు పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ పేరు భారతదేశంలో ఎంతమంది విని ఉంటారు? ఇప్పుడాయన ప్రపంచ కుబేరుల్లో 3వ వాడు.ఏప్రిల్ 2022లో ప్రఖ్యాత ఫోర్బ్స్ పత్రిక ప్రకటించిన జాబితా ప్రకారం భారతదేశంలోని 166 మంది బిలియనీర్లలో అదానీ తొలి స్థానం ఆక్రమించారు.150 బిలియన్ల డాలర్ల వ్యాపార నెట్ వర్క్ దేశంలోని మరే ఇతర పారిశ్రామిక వేత్తలకు అందనంత ఎత్తులో గౌతమ్ అదానీ ఉన్నాడు.దాదాపు 5 దశాబ్దాల నుండి దేశంలో విభిన్న రంగాలలో వ్యాపారాలు చేస్తూ దేశీయ పారిశ్రామిక వేత్తలకు రోల్మెడల్గా నిలిచే అంబానీ సంస్థల యజమాని ముఖేష్ అంబానీ ఒక్కరే 95 మిలియన్ల డాలర్ల వ్యాపార నెట్ వర్త్ తో గౌతమ్ అదానీకి కొంత సమీపంలో నిలుస్తున్నారు.
దేశంలో అనాదిగా సంప్రదాయ వ్యాపారాలు చేస్తూ వస్తున్న బిర్లాలు, టాటాలు, బజాజ్లు.మొదలైన వాళ్ల నెట్వర్త్ గౌతమ్ అదానీ నెట్వర్త్ లో 10వ శాతం మించదు.గౌతమ్ అదానీ నేడు చేయని భారీ వ్యాపారం అంటూ ఏదీ లేదు.దేశంలోని కీలక ఓడ రేవులలో జరిగే సరుకు రవాణా తదితర వ్యాపారాలన్నీ అదానీ చేజిక్కించుకున్నారు.
ఓడ రేవుల రక్షణపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నప్పటికీ దానిపై కేంద్రం పట్టించుకోవడం లేదు.ఇందుకుగల కారణం, అదేవిధంగా ఆయనకు తగిన ప్రోత్సాహం అందించేవారెవరో ప్రత్యేకంగా చెప్పాలా? దేశంలో ఈ 8 ఏళ్లల్లో బిలియనీర్ల సంఖ్య అనూహ్యంగా పెరగడం, వారి కారణంగా దేశ స్థూల ఉత్పత్తిలో పెరుగుదల కనిపించి ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలలో భారత్ 5వ స్థానాన్ని ఆక్రమించడం ఎన్డీఏ ప్రభుత్వం తను సాధించిన ఘనతగా చెప్పుకొంటోంది.ఓ దశాబ్దం క్రితం వరకు భారత్ ఆర్థిక వ్యవస్థ స్థానం ప్రపంచంలో 11వది.ఇప్పుడది 5వ స్థానానికి ఎగబాకింది.అది కూడా కోవిడ్ సృష్టించిన ఆర్ధిక సంక్షోభాన్ని అధిగమించి పెద్దపెద్ద అంగలతో ముందుకు సాగి అప్పటివరకు 5వ స్థాణంలో ఉన్న బ్రిటన్ ను వెనక్కు నెట్టి 5వ స్థానంలో నిలబడింది కనుక అది విజయంగా ఎన్డీఏ భావిస్తోంది.
దేశంలో అదుపు తప్పిన ధరలు, నిరుద్యోగం, దిగుమతులలో వృద్ధి, ఎగుమతులలో క్షీణత, రూపాయి పతనం, కొండలా పెరుగుతున్న అప్పులు, తగ్గుతున్న విదేశీ పెట్టుబడులు.
ఇలా ఇన్ని సమస్యల నేపథ్యంలో దేశ ఆర్ధిక వ్యవస్థ ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా అవతరించడం పట్ల దేశ ప్రజలందరూ గర్వించాలని నరేంద్రమోదీ, నిర్మలా సీతారామన్ ఇటీవల ప్రతివేదిక నుంచి గట్టిగా ప్రచారం చేస్తున్నారు.బ్రిటన్ ఆర్ధిక వ్యవస్థను భారత్ దాటడం అన్నది నిజానికి ప్రస్థుత యూరప్ సంక్షోభ పరిస్థితులలో గొప్ప విజయమేమీ కాదు.
బ్రిటన్లో చాలా కాలంగా ద్రవ్యోల్బణం రెండంకెలు దాటింది.బ్రిటన్ లోని అన్ని వర్గాల ఉద్యోగులు, ముఖ్యంగా రైల్వే కార్మికులు, రేవు కార్మికులు, పోస్టల్ కార్మికులు అధిక వేతనాలను డిమాండ్ చేస్తూ సమ్మె బాట పట్టారు.
ఉపాధ్యాయులు, బ్యాంకు ఉద్యోగులు, చివరకు వైట్ కాలర్ ఉద్యోగులుగా పేర్కొనదగ్గ ఉన్నతస్థాయి ఉద్యోగులు కూడా సమ్మెబాట పట్టడంతో ఇదివరకు ఎన్నడూలేని రీతిలో బ్రిటన్ ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.అక్కడి అనిశ్చిత రాజకీయ పరిస్థితులు కూడా అగ్నికి ఆధ్యంగా తోడయ్యాయి.
ఒక్క బ్రిటన్లోనే కాదు.స్పెయిన్, జర్మన్, బెల్జియం తదితర సంపన్న యూరోపియన్ దేశాలలో పరిస్థితులు ఏమంత మెరుగ్గాలేవు.
జర్మనీలో ఇటీవల పైలెట్లు సమ్మె చేయడంతో ఆ దేశంలో వందలాది విమానాల రాకపోకలు నిలిచిపోయి దేశ ఆర్ధిక వ్యవస్థకు తీరని నష్టం కలిగించింది.

భారతదేశంలో చాలాకాలం క్రితమే పలు కార్మిక చట్టాలను రద్దు చేశారు.లాభాలలో నడుస్తున్న పబ్లిక్ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నారు.వాటి వాటాలను కారుచౌకగా తెగనమ్ముతున్నారు.
అయినప్పటికీ ఇక్కడి కార్మికులు, ఉద్యోగులు, రాజకీయ పార్టీలు ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో ఉన్నారు.పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు గత రెండేళ్లుగా అనూహ్యంగా పెరిగినా ప్రజలు మౌనంగానే ధరల భారాన్ని మోస్తున్నారు.
నిత్యావసరాల ధరలతోపాటు నిర్మాణరంగంలో ఇసుక, స్టీలు, సిమెంటు ధరలు 40% కంటే మించి పెరిగాయి.ఇక జీఎస్టీ విధింపు అత్యధికంగా దాదాపు అన్ని వస్తువులపై విధించడంతో పేద ప్రజలు సైతం ధరాఘాతానికి గురవుతున్నారు.
దేశంలోని పలు ప్రాంతాలలో రైతులు క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నారు.ఈ ఏడాది ఖరీఫ్ సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గినట్లు తొలి అంచనా వివరాలు వెల్లడిస్తున్నాయి.
కాగా, భారత్లో జీనవ వ్యయం అనూహ్యంగా పెరగడంతో ప్రజల జీవన ప్రమాణాలు క్షీణిస్తున్నట్లు ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక వెల్లడించింది.







