విద్యుత్ వినియోగదారులపై ట్రూ అప్ చార్జీల భారం మోపడం నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో శనివారం ఆందోళన చేపట్టారు. ట్రూ అప్ చార్జీల భారాన్ని పూర్తిగా ఉపసంహరించాలని ఆ వ్యయాన్ని ప్రభుత్వమే భరించాలని ఈ సందర్భంగా వ్యక్తులు డిమాండ్ చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం లోని వన్ టౌన్ విద్యుత్ కేంద్రం వద్ద చేపట్టిన ధర్నాలో సిపిఎం పశ్చిమ గోదావరి (డెల్టా) జిల్లా కార్యదర్శి బి.బలరాం మాట్లాడుతూ గత నాలుగేళ్లలో విద్యుత్ రంగానికి వచ్చిన నష్టాలు రూ.3,799 కోట్లు నుండి రాష్ట్ర ప్రభుత్వం బయటపడడం కోసం వినియోగదారులు నుంచి ట్రూ అప్ ఛార్జీల పేరుతో భారం మోపడాన్ని సంహిచబోమన్నారు.కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ నిత్యావసరాలు ధరలు పెంచుకుంటూ పోతుంటే రాష్ట్రప్రభుత్వం అదేరీతిలో భారాలు మోపడం దుర్మార్గమని పేర్కొన్నారు.
ఏలూరు లోని విద్యుత్ శాఖ జిల్లా కార్యాలయం వద్ద పెదపాడులోని ఎఇ కార్యాలయం వద్ద ధర్నాలు నిర్వహించారు.విజయవాడ 50 వ డివిజన్ గొల్లపాలెం గట్టు కొండ ప్రాంతంలో ప్రజలు నిరసనలు తెలిపారు.
ఈ సందర్భంగా సిపిఎం కార్పొరేటర్ బోయి సత్తిబాబు మాట్లాడుతూ.వైయస్ జగన్ అధికారంలోకి రాకముందు అన్ని రకాల విద్యుత్ చార్జీలను రద్దు చేస్తామని అనేక సభల్లో ప్రగల్భాలు పలికారని అన్నారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలపై భారాలు మోపడం దుర్మార్గమని విమర్శించారు.విద్యుత్ వినియోగదారులపై టూ ఆఫ్ చార్జీల పేరుతో ప్రతి యూనిట్ కు రూ. 1.23 భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.