ఆఫీసుకి వెళ్ళినా, స్కూల్ కి వెళ్ళినా, మార్నింగ్ అవర్స్ చురుగ్గా ఉంటారు జనాలు.పనులన్నీ చక చక చేస్తుంటారు.
మధ్యాహ్నం అవుతుంది, లంచ్ బాగా తింటారు.అంతే, ఇక తంటాలు మొదలు.
నిద్ర ముంచుకు వస్తుంది.రాత్రి కూడా ఇలాంటి నిద్ర రాదేమో.
నిద్ర ముంచుకొస్తే ఇంకేముంది .పని మీద ధ్యాస అస్సలు ఉండదు.ఎవడు చేస్తాడ్రా బాబు ఇదంతా అంటూ పని మీద విరక్తి, విసుగు వచ్చేస్తుంది.ఇలా ఎందుకు జరుగుతుంది ? మధ్యాహ్నం మన మెదడు ఎందుకు చురుగ్గా పనిచేయదు ? తిండి తినేది ఎనర్జీ కోసమే కదా, మరి ఇంకా బాగా పనిచేయాల్సింది పోయి నిద్ర ఎందుకు వస్తుంది ? శరీరం ఎదో అలసిపోయినట్టు విశ్రాంతి ఎందుకు కోరుకుంటుంది ? దీని వెనుక సైన్స్ ఏమిటి ?
మనం భోజనం చేసిన తరువాత కొన్ని హార్మోన్స్ విడుదల అవుతాయి.పేరుకి చెప్పాలంటే గ్లుకాగోన్, అమిలిన్, సిసికె లాంటి హార్మోన్లు.వీటి వలన బ్లడ్ షుగర్ పెరిగి, ఆ తరువాత ఇన్సులిన్ విడుదల అయ్యి, రక్తంలో ఉన్న షుగర్ ని సెల్స్ లోకి పంపించి, దాన్ని ఎనర్జీ, అంటే బలం రూపంలోకి మారుస్తుంది.
ఈ ఎనర్జీ మనిషికి అత్యవసరం.లేదంటే శరీరం ఏ పనికి సహకరించదు.
చివరకి శ్వాస కూడా తీసుకోకుండా అయిపోతుంది.అందుకే మనుషులు మూడు పూటలా తింటారు.
అందుకే మనకు ఆకలి వేస్తుంది.ఇక ఈ హార్మోన్స్ తో పాటు, మెలటోనిన్ అనే హార్మోన్ పై కూడా మన తిండి ప్రభావం పడుతుంది.
ఈ హార్మోనే మనకు నిద్రను తీసుకొచ్చేది.కాబట్టి మనం ఏం తింటున్నాం అనే దాన్ని బట్టి యాక్టివ్ గా ఉంటామా లేదా నిద్ర పుట్టుకొస్తుందా అనేది జరుగుతుంది.
ఉదాహరణకు చెప్పాలంటే, ప్రోటీన్ ఎక్కువ ఉండే ఆహారాలు తిన్నప్పుడు నిద్రను తీసుకొచ్చే హార్మోన్స్ ఎక్కువ విడుదల అవుతుంటాయి.అందుకే మనం చికెన్ తిన్నప్పుడు నిద్ర ముంచుకువస్తుంది.చూడ్డానికి జనరల్ గా అనిపించినా, దీని వెనుక ఇంత సైన్స్ ఉంటుంది.కేవలం చికెన్ అనే కాదు, ప్రోటీన్ బాగా ఉండే గుడ్డు అయినా సరే, అలాగని మాంసాహారమే కాదు, ప్లాంట్ ప్రోటీన్స్, అంటే పాలకూర లాంటివి అనుకోండి, ఇలాంటి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తింటే నిద్ర ముంచుకువస్తుంది.
అందులోనూ చికెన్ లో ప్రోటీన్స్ చాలా ఎక్కువ కాబట్టి, చికెన్ ప్రభావం ఎక్కువ ఉంటుంది.అయితే ప్రోటీన్ ఒక్కటే కాదు, మరికొన్ని మినరల్స్, ఎమినో ఆసిడ్స్ కూడా నిద్రకు సంబంధించిన హార్మోన్స్ విడుదల చేస్తాయి.
కొన్ని చేపలలో ట్రైపోఫాన్ అనే ఎమినో ఆసిడ్ ఉంటుంది.దీని వలన కూడా నిద్రరావొచ్చు.
అలాగే అరటిపండు కూడా నిద్రను తీసుకువస్తుంది.ఎందుకంటే ఇది పొటాషియం వలన మన కండారాలు రిలాక్స్ అయ్యేలా చేస్తుంది.
కండరాలు రిలాక్స్ అవుతున్నాయంటే నిద్ర వస్తున్నట్టే కదా?
మరి నిద్ర రాకుండా ఏం తినాలి ? నిద్ర రాకుండా అని కాదు కాని, కొన్ని తింటే నిద్ర రాదు.ఇలా ఎందుకు అంటున్నాం అంటే పైన చెప్పిన ప్రోటీన్ అండ్ మినరల్స్ ఆహారాలు ఆరోగ్యానికి చేటు చేసేవి కావు కదా ? కాని అవి తినే సమయం మాత్రం పని మధ్యలో కాదు.మంచి డైట్ మధ్యాహ్నం కూడా తీసుకోవాలి.పళ్ళు, కూరగాయలు ఎక్కువ తినాలి.మనకు మీల్స్ ని విభజించే అలవాటు లేకపోవడం వలన మధ్యాహ్నం ఎక్కువ తినేస్తాం.అందుకే నిద్ర వస్తుంది.
కాని రోజుకి 5-6 పూటల్లో డైట్ ని తీసుకునేవారికి ఈ ఇబ్బంది ఉండదు.
అలాగే మనం చేస్తున్న పనిని బట్టి కూడా నిద్ర వస్తుంది.
అంటే శారిరక పనితీరు ఆ పనిలో ఎలా ఉందొ, దాన్ని బట్టి అన్నమాట.కూలి పనులు చేసుకునేవారు మధ్యాహ్నం అలసిపోయినట్టు ఫీల్ అవడం ఎప్పుడైనా చూసారా ? వారికి నిద్ర ముంచుకువస్తుందా ? కాని లక్షలలో జీతాలు తీసుకుంటూ కంప్యూటర్ ముందు ఏసీ గదిలో కూర్చునేవారికి నిద్ర వస్తుంది.ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటి అలాంటిది.మరి ఆనారోగ్యమా అంటే కాదు.డైట్ ఆరోగ్యవంతమైనది అయితే చాలు.నిజానికి మధ్యాహ్నం ఒకటిన్నర గంటలు నిద్రపోతే చాలమంచిది.
కాని ఎంతమంది ఆ ఆదృష్టం దొరుకుతుంది చెప్పండి !
.