రాపాక వరప్రసాద్.తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం ఎమ్మెల్యే.
జనసేన తరఫున గెలిచిన ఈయన తర్వాత వైసీపీకి అనుకూలంగా మారారు.అంతేకాదు జనసేనపై తీవ్ర విమర్శలు కూడా చేస్తూ ఆ పార్టీకి కొరకరాని కొయ్యగా మారారు.
ఇంత వరకు బాగానే ఉంది.పోనీ.
వైసీపీలో అయినా కుదురుగా ఉంటున్నారా? ఆయన తన పనితాను చేసుకునిపోతున్నారా? అంటే అది కూడా కనిపించడం లేదు.ఇక్కడ కూడా కుంపటి రాజేస్తున్నారు.
తన దూకుడుతో వైసీపీలోనూ వర్గ పోరుకు కారణంగా మారుతున్నా రు.దీంతో ఇప్పుడు వైసీపీలో రాపాక పెద్ద తలనొప్పిగా మారారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
తాజాగా పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది.నామినేషన్ల పర్వం కూడా ప్రారంభమైంది.సాధార ణంగా వైసీపీలో ఏళ్ల తరబడి ఉన్న నాయకులు కొంత మేరకు తమ అనుకూల వర్గానికి మేలు చేయాలని అనుకున్నారు.ఈక్రమంలోనే రాజోలు పరిధిలో వైసీపీ తరఫున మలికిపురం మండలం, చింతలమోరి సర్పంచి అభ్యర్థిని మాల కార్పొరేషన్ చైర్ పర్సన్ పెదపాటి అమ్మాజీ తరఫు వ్యక్తికి కేటాయించారు.
ఈ విషయం తెలిసిన రాపాక అగ్గిమీద గుగ్గిలం మాదిరిగా మండిపడ్డారు.

తనకు చెప్పకుండానే అభ్యర్థులను ఎవరుడిసైడ్ చేస్తున్నారంటూ చిందులు తొక్కడం వైసీపీలో సంచలనం సృష్టించింది.కేవలం ఆగ్రహం వ్యక్తం చేయడం కాదు బండ బూతులతో విరుచుకుపడ్డాడు.వైసీపీలో తాను చెప్పిందే వినాలంటూ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
సర్పంచ్ ఎంపిక అమ్మాజీ చూశారని అనడంతో మరింత ఆగ్రహానికి గురైన రాపాక ఈ విషయాన్ని అధిష్టానం వద్దే తేల్చుకుంటాననంటూ అక్కడికక్కడే ప్రతిజ్ఞలు చేశారు.
ఈ పరిణామంతో వైసీపీలో తీవ్ర అలజడి చోటు చేసుకుంది.
కాగా, రాపాక వెనుక కీలకమైన మంత్రి ఒకరు చక్రం తిప్పుతుండడంతో నాయకులు ఏమీ మాట్లాడలేక పోతున్నారనే వాదన ఉంది.అయితే వైసీపీలో ఇప్పటి వరకు ఇలాంటి సంస్కృతి లేదని ఇప్పుడు రాపాక కారణంగా పార్టీ పరువు పోతోందని నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.