ఏపీలో విపక్ష పార్టీల నుంచి అధికార వైసీపీలోకి వలసల పర్వ బ్రేక్ లేకుండా కంటిన్యూ అవుతోంది.2019 సాధారణ ఎన్నికలు ముగిసినప్పటి నుంచే ఈ వలసలు జోరందుకున్నాయి.నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలే కాకుండా పలువురు కీలక నేతలు, మాజీ మంత్రులు.రాజ్యసభ సభ్యులు కూడా వైసీపీలోకో లేదా బీజేపీలోకో వెళ్లి పోతున్నారు.అయితే అలా పార్టీ మారిన వారిలో కొందరు అక్కడ ఇమడ లేకపోతున్నారన్న ప్రచారం బయటకు వచ్చింది.చాలా మందికి పార్టీ మారిన రోజు కండువా మార్పించుకున్నప్పుడే జగన్ దర్శనం దొరికిందే తప్పా ఆ తర్వాత జగన్ అపాయింట్ మెంట్ అడిగినా ఇవ్వని పరిస్థితి.
కొంత మంది అసలు తాము పార్టీ ఎందుకు మారామా ? బాబు అని తల పట్టుకుంటోన్న పరిస్థితి.ఇలాటి వారిలో కొందరు ఇప్పుడు సొంత ఇంటికి వచ్చేస్తే బాగుండును అని అనుకుంటున్నారట.
వీరిలో కొందరు ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది.ఈ లిస్టులో మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు పేరు ముందు వరుసలో వినిపిస్తోంది.
ప్రకాశం జిల్లా కు చెందిన మాజీ మంత్రి శిద్ధా టీడీపీ ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు మంత్రిగా ఉన్నారు.ఆయన గతంలో దర్శి ఎమ్మెల్యేగా ఉండేవారు.

ఎన్నికలకు ముందు చంద్రబాబు ఆయన్ను పట్టుబట్టి ఒంగోలు ఎంపీగా పోటీ చేయించగా ఆయన ఓడిపోయారు.ఆ తర్వాత ఆయన వ్యాపారాలపై ప్రభుత్వం టార్గెట్ చేస్తూ దాడులు చేయించడంతో ఆయన పార్టీ మారిపోయారు.వైసీపీలో ఉంటే పట్టించుకునే వాళ్లు లేకపోవడంతో పాటు రాజకీయ భవిష్యత్తు కూడా లేకపోవడంతో ఇప్పుడు ఆయన పార్టీ మారిపోయేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఆయనకు సొంతిళ్లు గుర్తు వచ్చిందని మరి కొద్ది రోజుల పాటు అక్కడే వెయిట్ చేసి సరైన టైం చూసుకుని ఆయన పార్టీ మారిపోతారని గుసగుసలు వస్తున్నాయి.