ఏపీ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీలో అప్పుడే టిక్కెట్ల హడావుడి మొదలైపోయింది.రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీ కీలక నాయకులంతా సిద్ధమవుతున్నారు.
అధినేత చంద్రబాబు టికెట్ల ప్రకటనలు చేయకముందే తామే పలానా నియోజకవర్గంలో నుంచి పోటీ చేస్తున్నామంటూ ప్రకటనలు చేస్తున్నారు.దీనికి తగ్గట్లుగానే ఏర్పాట్లు చేసుకుంటూ నియోజకవర్గంలో తమ బలం నిరూపించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
ముఖ్యంగా నెల్లూరు జిల్లా రాజకీయాల గురించి చర్చించుకుంటే … 2019 ఎన్నికల్లో ఈ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ వైసీపీ జెండా ఎగిరింది.వాస్తవంగా చెప్పుకోవాలంటే నెల్లూరు జిల్లాలోని 10 నియోజకవర్గాల్లోనూ తెలుగుదేశం పార్టీ బాగా బలహీనంగా ఉంది.
పార్టీకి సీనియర్ నాయకులు చాలామంది ఉన్నా, వారంతా వరుసగా ఓటమి చెందుతూనే వస్తున్నారు.
ఇక నెల్లూరు నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడి నుంచి గత ఎన్నికల్లో మున్సిపల్ మంత్రిగా పనిచేసిన నారాయణ పోటీ చేశారు.
టిడిపి అధికారంలో ఉన్న సమయంలో నెల్లూరు నగరానికి కోట్లాది రూపాయల నిధులు కేటాయించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన నారాయణకు 2019 ఎన్నికల్లో నిరాశ తప్పలేదు.దీంతో గత కొంతకాలంగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ, వ్యాపార వ్యవహారాలపై దృష్టి సారించారు.

2024 ఎన్నికల్లో ఆయన పోటీ చేసే అవకాశం కనిపించడం లేదు.దీంతో ఈ నియోజకవర్గంలో జనసేన ఆశలు పెట్టుకుంది.టిడిపి జనసేన పొత్తు కుదిరితే నెల్లూరు నియోజకవర్గాన్ని తమకు కేటాయించాల్సిందిగా పట్టుబట్టే అవకాశం కనిపిస్తోంది.అయితే ఇక్కడ పోటీ చేసేందుకు ‘ ఆనం ‘ కుటుంబం ఆశలు పెట్టుకుంది.
నెల్లూరు టౌన్ లేదా రూరల్ నియోజకవర్గం నుంచి ఎక్కడైనా పోటీకి సిద్ధమే అన్నట్టుగా సంకేతాలు పంపుతోంది.అయితే జనసేన , టిడిపి పొత్తు కుదిరితే నెల్లూరు నియోజకవర్గం జనసేన ఖాతాలోకి వెళుతుంది.
దీంతో రూరల్ నియోజకవర్గం పైనే టిడిపి సీనియర్ నేత ఆనం వెంకట రమణారెడ్డి ఆశలు పెట్టుకున్నారు.

అయితే అనూహ్యంగా కొద్దిరోజుల క్రితం వైసీపీపై తిరుగుబాటు ఎగరవేసిన నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టిడిపి నుంచే తాను పోటీ చేస్తానంటూ ప్రకటన చేశారు.ఈ నియోజకవర్గంలో ఆయన కు గట్టి పట్టు ఉండడం తో చంద్రబాబు కూడా శ్రీధర్ రెడ్డి వైపు మొగ్గు చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.దీంతో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న ఆనం రమణారెడ్డికి నిరాశ తప్పేలా కనిపించడం లేదు.
మరో వైపు చూస్తే ఆయన సోదరుడు రాం నారాయణ రెడ్డి వైసీపీ వెంకటగిరి ఎమ్మెల్యే గా ఉన్నారు.ఆయన పార్టీపై అనేక విమర్శలు చేశారు.రాబోయే ఎన్నికల్లో వెంకటగిరి నియోజకవర్గ టిడిపి అభ్యర్థిగా పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.దీంతో రాం నారాయణ రెడ్డి విషయంలో టిడిపి కూడా సానుకూలంగా ఉండడంతో , ఆయనను ఎన్నికలకు ముందు పార్టీలో చేర్చుకుని వెంకటగిరి నియోజకవర్గ టికెట్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.
కానీ ఎప్పటి నుంచో నెల్లూరు రూరల్ నియోజకవర్గం పై ఆశలు పెట్టుకున్న ఆనం వెంకటరమణారెడ్డి కి మాత్రం నిరాశ తప్పేలా కనిపించడం లేదు.