ఎడిటోరియల్ :  నిమ్మగడ్డ వర్సెస్ వైసీపీ ? స్థానిక పోరులో విజేత ఎవరు ? 

ఏపీ ప్రభుత్వం చుట్టూ ఎప్పుడూ, ఏదో ఒక వివాదం నడుస్తూనే వస్తోంది.

ఎన్నో రకాలుగా ప్రయత్నించి , ఏపీలో తన ముద్ర  స్పష్టంగా కనిపించేలా చేయాలని, ఏపీ సీఎం జగన్ కాస్త ఉత్సాహంగానే అడుగులు వేస్తున్నారు.

అయితే ఆ ఉత్సాహం కాస్తా, అతిగా మారడంతో ఎన్నో రకాల ఇబ్బందులను ఆయన ప్రభుత్వం నుంచి ఎదుర్కోవాల్సి వస్తోంది.ప్రతి పథకం పైన , ప్రతి నిర్ణయం పైన, వివాదాలు చెలరేగుతూ ఉండడం, అవి కోర్టు మెట్లు ఎక్కడం సర్వసాధారణంగా మారిపోయింది.

దీంతో ప్రశంసలను అందుకోవలసిన వైసీపీ ప్రభుత్వం కాస్తా, విమర్శలు ఎదుర్కొంటోంది.రాజ్యాంగ సంస్థలతో తల పడే విధంగా, ఏపీ సీఎం జగన్ వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది.

కొద్ది రోజుల క్రితం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కి మరో న్యాయమూర్తిపై ఆరోపణలు చేస్తూ జగన్ లేఖ రాయడం సంచలనంగా మారింది.ఈ వ్యవహారంలో జగన్ చిక్కులు ఎదుర్కోక తప్పదు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న తరుణంలో నే, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇదే విధమైన వైఖరితో ముందుకు వెళ్తున్నారు.

Advertisement

  స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసింది.ఈ ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలు ఉత్సాహంగా పాల్గొన్నాయి.

మరో కొద్ది రోజుల్లో పోలింగ్ జరగబోతుంది అని అంతా అనుకుంటున్న సమయంలో, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో ఆ ఎన్నికలను వాయిదా వేశారు.దీంతో  ఒక్కసారిగా వైసీపీ ఆయనపై విమర్శలు చేసింది.

రాజకీయ పార్టీలను సంప్రదించకుండా ఎన్నికలను ఏవిధంగా వాయిదా వేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.దీనిపై ఎన్నో సంచలన విమర్శలనువైసీపీ చేసింది.

ఆ తర్వాత దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నిబంధన విధించడంతో, ఇక ఆ వ్యవహారం కాస్త సద్దుమణిగింది.ఇక ఇప్పుడు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ మొగ్గు చూపిస్తోంది.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

వైసీపీ ప్రభుత్వం మాత్రం ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించేందుకు వీల్లేదని, కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉందని , ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులు,  పోలీస్ సిబ్బంది చాలామంది ఈ వైరస్ ప్రభావం కు గురయ్యారని,  ఎన్నికలను వాయిదా వేయాలంటూ పట్టుబడుతోంది. ఎన్నికల కమిషన్ మాత్రం, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు మొగ్గుచూపుతోంది.

Advertisement

దీనికి టీడీపీ సైతం మద్దతు ఇస్తోంది.ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టు వరకు వెళ్ళింది.

హైకోర్టులో నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిటిషన్ దాఖలు చేయడం, తాను ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నానని, ప్రభుత్వం సహకరిస్తుందా లేదనేది అనుమానమే అంటూ ఆయన హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు.ఎన్నికల నిర్వహణకు సంబంధించి వివిధ రాజకీయ పార్టీలతో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని , రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారి నుంచి సేకరించిన అభిప్రాయాలను, అలాగే ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరాన్ని, పేర్కొంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు.

ఈ సందర్భంగా వివిధ రాజకీయ పార్టీలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు అన్నిటిని నిమ్మగడ్డ అఫిడవిట్ ద్వారా కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. 

ఏపీలో స్థానిక సంస్థల పాలకవర్గాల పదవీకాలం ముగిసి చాలా కాలం అయింది అని, కరోనా వైరస్ కారణంగానే ఎన్నికలను వాయిదా వేయాల్సి వచ్చిందని, ప్రస్తుతం ఆ వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టింది అంటూ రమేష్ కుమార్ పేర్కొనడం, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ విషయంలో వ్యవహరిస్తున్న తీరును హైకోర్టు దృష్టికి నిమ్మగడ్డ తీసుకువెళ్లారు.రాష్ట్ర ప్రభుత్వం సహకరించినా సహకరించకపోయినా, ఎన్నికలను తన పదవీకాలం ముగిసే లోపు నిర్వహించాలని,  అవసరమైతే కోర్టు ద్వారానే కేంద్ర బలగాలను రంగంలోకి దించి, ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించి పూర్తిచేయాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ కంకణం కట్టుకోగా, ఏపీ ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు నిర్వహించేందుకు తాము అంగీకరించేది లేదు అంటూ స్పష్టంగానే చెప్పేస్తుంది.    ఈ పరిస్థితుల్లో హైకోర్టు దీనిపై ఏ విధమైన తీర్పు ఇస్తుందనేది ఉత్కంఠగా మారింది.

ఏది ఏమైనా ఈ ఎన్నికల నిర్వహణ వ్యవహారం అటు ఏపీ ప్రభుత్వానికి, ఇటు ఎన్నికల కమిషన్ కు పెద్ద తలనొప్పిగా తయారైంది.ఈ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం పై చేయి సాధిస్తుందా, లేక రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై చేయి సాధిస్తారా అనేది మరికొద్ది రోజుల్లోనే తేలిపోనుంది.

తాజా వార్తలు