త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటుకునేందుకు కాంగ్రెస్( Congress ) ప్రయత్నాలు చేస్తోంది, ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావడంతో, మెజారిటీ ఎంపీ స్థానాల్లోనూ తమ సత్తా చాటుకుంటాము అనే నమ్మకంతో కాంగ్రెస్ ఉంది.అందుకే అభ్యర్థుల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలే తీసుకుంటుంది.
ఆచితూచి అభ్యర్థులను ఫైనల్ చేస్తున్నారు.ఇప్పటికే అభ్యర్థుల జాబితాపై కసరత్తు పూర్తి చేశారు.
ఢిల్లీలో టి.పిసిసి నేతలతో కాంగ్రెస్ సీఈసీ సమావేశం నిర్వహించింది.ఆ సమావేశంలోనే అభ్యర్థుల జాబితా విడుదలవుతుందని అంతా భావించారు.కానీ రాహుల్ గాంధీ( Rahul Gandhi ) కేరళ లోని వాయునాడ్ నుంచి పోటీ చేస్తారని ఏఐసిసి ప్రకటన చేసింది.
ఇక పూర్తి స్థాయిలో మార్పు చేర్పులు పూర్తయ్యాక తుది జాబితాను ప్రకటించనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.తెలంగాణలో మొత్తం 7 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
మొత్తం 17 స్థానాలకు గాను మొదటి విడత జాబితాలో ఏడు స్థానాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది.

ఢిల్లీ ఏఐసిసి కార్యాలయంలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా ,రాహుల్ గాంధీ, జయరాం రమేష్ ( Mallikarjuna Kharge, Sonia, Rahul Gandhi, Jayaram Ramesh ) ఆధ్వర్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలతో సీఈసీ సమావేశం జరిగింది.కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ భేటీకి తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు.ఈ సమావేశంలో తెలంగాణ నుంచి పోటీ చేయబోయే లోక్ సభ అభ్యర్థుల ఎంపికపై చర్చించారు.
నియోజకవర్గాల వారీగా బల, బలాలు, సామాజిక సమీకరణాలను లెక్కలు వేసుకుని అభ్యర్థుల ఎంపికపై చర్చించారు.నిన్ననే అభ్యర్థుల జాబితా విడుదల చేసేందుకు కసరత్తు జరిగినా, చివరకు ఆ జాబితాను ప్రకటించకుండానే సమావేశాన్ని ముగించారు.
అయితే ఈరోజు తొలి జాబితాను విడుదల చేసేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం.

తెలంగాణలో ఉన్న 17 లోక్ సభ నియోజకవర్గాల్లో, మహబూబ్ నగర్ నుంచి వంశీచంద్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తారని ఓ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ప్రకటించారు.దీంతో మిగిలిన 16 స్థానాల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితా విడుదల కావాల్సి ఉంది.సికింద్రాబాద్, పెద్దపల్లి, నల్గొండ, మహబూబ్ నగర్, మహబూబాబాద్ ,చేవెళ్ల, మల్కాజి గిరి స్థానాలపై ఏకాభిప్రాయం కుదరగా, మిగతా స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.