తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టిన దగ్గర నుంచి బీజేపీ విషయంలో ఆయన వ్యవహరిస్తున్న తీరు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.మొదట్లో బీజేపీతో సన్నిహితంగా కేసిఆర్ మెలిగారు.
రాష్ట్రస్థాయిలో బిజెపి ప్రధాన ప్రత్యర్థిగా టిఆర్ఎస్ చూస్తున్నా, కేసీఆర్ మాత్రం కేంద్ర బీజేపీ పెద్దలతో సన్నిహితంగా మెలుగుతూ, వారిపై ప్రశంసలు కురిపిస్తూ ఉండేవారు.కానీ గత కొంత కాలంగా కేసిఆర్ వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది.
కేంద్ర బిజెపి పెద్దలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ విరుచుకుపడుతున్నారు.తెలంగాణలో బీజేపీ పై ఏ వైఖరితో ఉన్నారో కేంద్రం విషయంలోనూ ఇదే వైఖరిని కనబరుస్తున్నారు.
ఇక ప్రోటోకాల్ ప్రకారం ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించే కీలక సమావేశాలకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతున్న, తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం ఆ సమావేశాలకు డుమ్మా కొడుతున్నారు.
అత్యవసర సమావేశాలకు సైతం ఇదే వైఖరి అవలంభిస్తున్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సన్నిహిత సంబంధాలు ఉండాలి.రాజకీయంగా వైరం ఉన్నా, కేంద్రంతో రాష్ట్ర ప్రయోజనాల విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కొత్త ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాల విషయంలో రాష్ట్రానికి పెద్దపీట వేసేలా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవారు ప్రయత్నం చేయాలి .కానీ దీనికి భిన్నంగా కేసీఆర్ కేంద్రంతో పేచి పెట్టుకుంటున్నారు.కెసిఆర్ ఉద్దేశపూర్వకంగానే కేంద్రంతో తగాదా పెట్టుకుంటూ, ప్రధాని సమావేశాలకు హాజరు కావడం లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణ సీఎం కేసీఆర్ పదేపదే ప్రోటోకాల్ ఉల్లంఘిస్తున్నారు అంటూ బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.తాజాగా నాలుగు రోజుల క్రితం దేశవ్యాప్తంగా ఫోర్త్ వేవ్ వచ్చే సూచనలు ఉండడంతో , అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు .

దీనికి సైతం కెసిఆర్ హాజరు కాలేదు.తాజాగా ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించారు.సీజేఐ జస్టిస్ రమణ నేతృత్వంలో ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో హైకోర్టు సీజే లు, ముఖ్యమంత్రుల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసిన కెసిఆర్ ఆ సమావేశానికి హాజరు కాలేదు.తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాత్రమే వెళ్లారు.
ఇంతకుముందు హైదరాబాద్ లో భారత్ బయోటెక్ సందర్శించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు .ఈ సమావేశానికి కేసీఆర్ హాజరు కాలేదు.ఈ విధంగా కెసిఆర్ అన్ని కీలక సమావేశాలకు దూరంగా ఉంటూ బీజేపీపై తనకు ఏ స్థాయిలో ఆగ్రహం ఉంది అనే విషయాన్ని ఈ విధమైన సంకేతాల ద్వారా వెల్లడిస్తున్నారు.