కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీల్లో నేతలు ఎవరు అసంతృప్తిగా ఉంటే చాలు వారి వద్దకు వాలిపోతుంది కమలదళం.దీపం ఉండగానే ఇళ్లు చక్కదిద్దుకోవాలనే ఫార్ములాను బీజేపీ అక్షరాలా అమలు చేస్తోంది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఎలా వస్తాయో ? ఎన్ని సీట్లు గెలుస్తాయో అనే అంచనాలు పక్కన పెట్టి దుబ్బాక ఉప ఎన్నికల జోష్ తగ్గకముందే ఆయా పార్టీలలోని అసంతృప్తి నేతలకు కాషాయ తీర్థం ఇచ్చేందుకు పక్కా స్కేచ్ వేసుకున్నది.ఇందులో భాగంగానే కాంగ్రెస్, టిఆర్ఎస్ లో అసంతృప్తిగా, పార్టీ కార్యకలాపాలకు దూరంగా వున్న నేతలకు గాలం వేస్తోంది.
ఇప్పటికే కాంగ్రెస్ లోని ముఖ్య నేతలైన విజయశాంతి, సర్వే సత్యనారాయణతో భేటీ అయ్యారు.మరి కొందరికి ఇప్పటికే కాషాయం జెండా కూడా కప్పారు.
తాజాగా టిఆర్ఎస్ కు చెందిన నేత, తెలంగాణ శాసన మండలి మాజీ ఛైర్మెన్ కె స్వామి గౌడ్‌తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చర్చలు కూడా జరిపారు.గ్రేటర్ ఎన్నికలకు ముందే మరి కొంత మంది నేతలను బీజేపీలో చే్ర్చుకునేందుకు బిజెపి నేతలు సర్వ శక్తులు ఒడ్డుతున్నారు.2023లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకుని బీజేపీ నాయకత్వం ఇప్పటి నుంచే వలసలను ప్రోత్సహిస్తోంది.తమ ముందస్తు వ్యూహంలో భాగంగా ఇప్పడు జరుగుతున్న జీహెచ్ఎంసీ ఎన్నికలను ప్రాక్టికల్ ఎగ్జామ్ గా వాడుకుంటున్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది.
ఈనేపథ్యంలోనే ముందు కాంగ్రెస్‌లోని అసంతృప్తి, అలాగే కొంత కాలంగా పార్టీకి దూరంగా ఉన్న వారిని తమ పార్టీలోకి తీసుకువచ్చేందుకు బీజేపీ నాయకత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

దుబ్బాక జోష్ తగ్గక ముందే…
దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు కమలదళంలో జోష్‌ను నింపడమే కాదు.కాంగ్రెస్‌ను తీవ్ర నిరాశకు గురిచేసింది.ఈ ఫలితాలు తెలంగాణ రాష్ర్ట రాజకీయాల్లో కొంత ప్రభావాన్ని చూపుతాయని మొదటి నుంచి రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తూనే ఉన్నారు.
బిజెపి గెలువడం, కాంగ్రెస్‌కు చావుదెబ్బ తగలడంతో అధికార టిఆర్ ఎస్‌కు బిజెపినే ప్రత్నామ్నాయం అనే రాజకీయ వాతావరణాన్ని ఆ పార్టీ నేతలు సృష్టించగలిగారు.అదే జోష్‌ను గ్రేటర్ ఎన్నికల్లో కొనసాగిస్తున్నారు.
అయితే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలల్లో కూడా బిజెపినే గెలుస్తుందనే ప్రచారం విస్తృతంగా చేపడుతోంది.అయితే మేయర్ ఎన్నికల్లో కో ఆప్షన్ సభ్యుల ఓట్లతో గ్రేటర్ పీఠాన్ని దాదాపుగా టిఆర్ ఎస్‌కే దక్కె అవకాశం పుష్కలంగా ఉన్నట్టు రాజకీయ వర్గాలు బావిస్తున్నాయి.
మేయర్ పీఠం దక్కడం ఇప్పట్లో సాధ్యమయ్యే విషయం కాదనేది సాక్షాత్తూ బిజెపిలోని ముఖ్యనేతలకూ తెలుసు.
మేయర్ స్థానం దక్కేందుకు కావాల్సిన అసలు మ్యాజిక్ ఫిగర్ బిజెపి సాధించడం కష్టసాధ్యమే అనేది కూడా పార్టీ ముఖ్యులకు తెలుసు.
కానీ మేయర్ దక్కదనే విషయం ప్రచారం జరిగితే గెలుస్తామని ఆశలు పెట్టుకున్న సీట్లు కూడాతగ్గే అవకాశాలు ఉండడంతో తమదే గెలుపు అన్నట్లుగా ప్రజల్లో బీజేపీ హైప్ క్రియేట్ చేస్తున్నది.దీంతో మేయర్ పీఠం మనదే అనే ప్రచారం ద్వారా కనీసం ఎక్కు వ కార్పోరేటర్ల సీట్లను కైవసం చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది.
ఒక వేళ గ్రేటర్ లో బిజెపికి ఆశించిన స్థాయిలో సీట్లు రాకపోతే ఉన్న జోష్ కూడా పోతుంది.ఆ తర్వాత ఇతర రాజకీయ పార్టీల నుంచి ఇతరులు బిజెపిలో చేరేందుకు పెద్దగా ఇష్టపడరు.
తద్వారా ఇంత వరకు బిజెపికి ఉన్న ఊపు బూడిదల పోసిన పన్నీరు అవుతుంది.దీంతో రాబోయే అసెంబ్లీ ఎన్నికల లక్ష్యం నీరుగారే అవకాశం ఉంది.ఈక్రమంలోనే గ్రేటర్ ఎన్నికల లోపే సాధ్యమైనంత వరకు వివిధ రాజకీయ పార్టీలలోని బలమైన, ప్రజాభిమానం ఉన్న నేతలను తమ వైపు తిప్పుకనేందుకు బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.