రైతులు ఏ పంటను సాగు చేసినా అధిక దిగుబడులు సాధించాలంటే.నేల తయారీ, విత్తనం ఎంపిక, విత్తుకునే విధానం, పోషక ఎరువుల యాజమాన్యంలలో సరైన జాగ్రత్తలు పాటిస్తూ సాగు చేయాలి.
తీగజాతి కూరగాయలలో ఒకటైన సొరకాయ పంటను( Bottle Gourd ) విత్తుకునే విధానం గురించి పూర్తిగా తెలుసుకుందాం.సొరకాయ పంట సాగుకు నల్లరేగడి నేలలు, ఎర్ర నేలలు, నీరు ఇంకిపోయే నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి.
నీరు నిల్వ ఉండే నేలలు, లవణ శాతం అధికంగా ఉండే నేలలు ఈ పంట సాగుకు పనికిరావు.
ఒక ఎకరాకు 8 టన్నుల పశువుల ఎరువు( Cattle manure ) వేసి పొలా న్ని కలియ దున్నుకొని, విత్తనం వేసే ముందు నేల వదులుగా అయ్యేవరకు దమ్ము చేసుకోవాలి.
సొరకాయ పంట సాగు మూడు రకాలుగా చేయవచ్చు.పై పందిరి పద్ధతి, అడ్డు పందిరి పద్ధతి, బోదెల పద్ధతి.సొరకాయ పంటకు వివిధ రకాల చీడపీడల, తెగుళ్ల బెడద ( Pests )తక్కువగా ఉండాలంటే, పైగా వీటిని తొలి దశలోనే అరికట్టాలంటే పై పందిరి పద్ధతిలో సాగు చేయడం మంచిది.ఒకవేళ అలా సాగు చేయడానికి కుదరకపోతే అడ్డుపందిరి పద్ధతిలో సాగు చేయాలి.

మొక్కల మధ్య దూరం 3 అడుగులు, మొక్కల వరుసల మధ్య దూరం ఆరు అడుగులు ఉండేటట్లు విత్తనం విత్తుకోవాలి.అప్పుడు మొక్కలకు సూర్యరశ్మితో పాటు గాలి బాగా తగిలి మొక్కలు ఆరోగ్యకరంగా పెరుగుతాయి.చీడపీడల, తెగుళ్ల వ్యాప్తి తక్కువగా ఉంటుంది.ఒక ఎకరాకు 600 గ్రాముల విత్తనాలు అవసరం.విత్తనాలను విత్తన శుద్ధి చేసుకుని నాటుకుంటే భూమి నుంచి వివిధ రకాల తెగుళ్లు పంటను ఆశించే అవకాశం తక్కువ.

ఇక కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉండాలి.సొరకాయ పంట సాగుకు నీటి అవసరం చాలా ఎక్కువ.పంట పూత దశలో ఉన్నప్పుడు కనీసం రెండు రోజులకు ఒకసారి అయినా నీటి తడి అందించాల్సి ఉంటుంది.
ఇక కాయలు ఎదుగుదలలో నీటిని ఎక్కువగా తీసుకుంటాయి.డ్రిప్ ఇరిగేషన్ ద్వారా సొరకాయ పంట సాగు చేస్తే కలుపు సమస్య తక్కువగా ఉంటుంది.
పై పందిరి పద్ధతి ద్వారా సాగు చేస్తే సొరకాయ నాణ్యత బాగుంటుంది.కాయలు వంకర్లు తినకుండా ఆకృతి బాగుంటుంది.
పై పందిరి పద్ధతి వల్ల రెట్టింపు దిగుబడులు సాధించవచ్చు.నేలపై సాగు చేస్తే నేల కాయకు తగిలిన వైపు తెల్లగా ఉంటుంది.
దీంతో సరైన గిట్టుబాటు ధర లభించదు.అదే పై పందిరి పద్ధతి ద్వారా సాగు చేస్తే కాయ నాణ్యత బాగుంటుంది కాబట్టి మంచి గిట్టుబాటు ధర పొందవచ్చు.