వైసీపీలో చేరికల సందడి మళ్ళీ మొదలు కాబోతున్నట్లు కనిపిస్తోంది.టిడిపి ఇతర పార్టీల నుంచి పెద్దఎత్తున నాయకులు వైసీపీలో చేరేందుకు, ఆ పార్టీలోని కీలక నేతలను కలుస్తూ, వారి ద్వారా వైసిపి అధిష్టానాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తున్న ఘటనలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి .
ప్రస్తుతం టిడిపిలో ఉన్న నాయకుల్లో చాలా మందికి ఆ పార్టీ భవిష్యత్తుపై ఆందోళన ఉంది.అలాగే అధికార పార్టీ వైసీపీ వేధింపులు తప్పవు అని, టీడీపీలో ఉండే కంటే వైసీపీ లో చేరిపోతే మరో మూడేళ్ల పాటు ఎటువంటి ఇబ్బందులు ఉండవని, నియోజకవర్గ స్థాయి నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యే లు ఇలా చాలా మంది అభిప్రాయపడుతున్నారట.
ప్రస్తుతం చూస్తుంటే టిడిపి కీలక నాయకులే టార్గెట్ గా వైసీపీ ప్రభుత్వం ముందుకు వెళుతున్నట్లు కన్పిస్తోంది.గతంలో ఎప్పుడో నమోదైన కేసులు, అనేక ఆర్థిక వ్యవహారాలలోను జైలుపాలు చేస్తుండడం, మిగిలిన నాయకులలో భయాందోళనలు పుట్టిస్తున్నాయి.

అదీ కాకుండా , టిడిపి క్రమక్రమంగా బలహీనం అవుతున్న క్రమంలో, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకే మళ్లీ ఛాన్స్ ఉంటుందని చాలామంది నాయకులు అభిప్రాయానికి వచ్చేసారు.అందుకే ఇప్పుడు వైసీపీలో చేరిపోతే తమకు పెద్దగా ఇబ్బంది ఉండదు అనేది ఇతర పార్టీల్లోని నాయకుల అభిప్రాయంగా కనిపిస్తోంది.అయితే మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు విషయానికి వస్తే, వారిలో మరింత ఆందోళన ఉన్నట్లు గా కనిపిస్తోంది.కొంతమంది నాయకులు తమకు పదవులు, టిక్కెట్లు అవసరం లేదని , తమను వైసీపీలో చేరనిస్తే సరిపోతుంది అంటూ మాట్లాడుతున్న మాటలు వారిలో ఉన్న భయాందోళనలు తెలియజేస్తున్నాయి.
శ్రీకాకుళం నుంచి రాయలసీమ వరకు చూసుకుంటే పెద్దఎత్తున నాయకులు ఈ విధంగా చేరేందుకు సిద్ధంగా ఉన్నారు.కాకపోతే జగన్ నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నారు.
ముఖ్యంగా మాజీ మంత్రి భూమా అఖిలప్రియ జగన్ తల్లి విజయమ్మ ద్వారా వైసీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట .
తనకు పదవులు ఏమీ అవసరం లేదంటూ ఆమె చెబుతున్నట్టు తెలుస్తోంది.ఇక ప్రస్తుత మంత్రులు , ఎమ్మెల్యేల ద్వారాను, మరి కొంతమంది నాయకులు వైసీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.పార్టీలో చేరికల విషయంలో జగన్ సైలెంట్ గా ఉన్నారు.
ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తే భారీ స్థాయిలో అన్ని జిల్లాల నుంచి చేరికలు ఉండబోతున్నాయి అంటూ వైసిపి నాయకులే ఇప్పుడు హడావుడి చేస్తున్నారు.