ఈనెల 14 నుంచి 18 వరకు టీడీపీ ఆధ్వర్యంలో జోనల్ వారిగా రైతు కోసం పోరుబాటకు సన్నద్ధమవ్వాలని పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.పార్టీ ముఖ్య నేతలతో సోమవారం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రజా సమస్యలపై సమావేశంలో చర్చించి వివిధ నిర్ణయాలు తీసుకుంది.చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో పంట పొలాలు కౌలుకు చేసుకునే పరిస్థితులు లేవని, పెట్టుబడి వ్యయం రెట్టింపు అయిందని రైతులకు ఇచ్చే సబ్సిడీ నిలిచిపోయాయని తెలిపారు.సగటున రైతు కుటుంబం రుణభారం రూ.2.5 లక్షలకు మించి, రాష్ట్రం మొదటి స్థానంలో ఉండటం వైఎస్ జగన్ రైతుకు వ్యతిరే నినాదాలకు నిదర్శనం అన్నారు.కాగా పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసిన అక్బర్ బాషా కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన మైనారిటీ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు మహమ్మద్ ఫారుఖ్ షుబ్లీ పై హత్యాయత్నం కేసు నమోదు చేయడం జగన్ మైనారిటీలకు చేసిన ద్రోహంగా సమావేశం అభిప్రాయపడింది.

విద్యుత్ చార్జీల పెంపుతో ప్రజలపై జగన్ పెనుభారం మోపారని, దీని వల్ల అన్ని వర్గాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపింది.రొయ్యలు, చేపల చెరువుల రైతుల వద్ద ట్రూ అఫ్ చార్జీలు వసూలు చేస్తున్నారని, తూర్పుగోదావరి జిల్లాలో ఒక రొయ్యల రైతుకు గతంలో రూ.28 వేల విద్యుత్తు బిల్లు ఉండగా అది నేడు రూ.58 వేలకు పెరిగిందని పేర్కొంది.ఈ భారాలు మోపడానికి కారణం కమిషన్ ల కోసం అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేసే వాటిని ప్రజలపై మోపుతున్నారని తెలిపింది.ప్రభుత్వమే మటన్, చేపల నిర్వహిస్తుందన్న జగన్ వ్యవహారశైలి హాస్యాస్పదంగా ఉందని తెలిపింది.
వైసీపీ నేతల దోపిడిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రూపొందించాలని నిర్ణయించింది.చట్టాలను ఉల్లంఘించిన పోలీసులు, ఇతర అధికారులను భవిష్యత్తులో వదిలి పెట్టకూడదని ప్రైవేట్ కేసులు పెట్టాలని నిర్ణయించింది.
తొలగించిన రేషన్ పెన్షన్ల పునరుద్ధరణ కోసం పోరాటం కొనసాగించాలని సమావేశం తీర్మానించింది.కరోనా వ్యాక్సిన్ విషయంలో జగన్ గొప్పలు చెప్పుకుంటున్నారని ఈ విషయంలో జాతీయ సగటు కంటే రాష్ట్ర సగటు తక్కువగా ఉన్న విషయాన్ని గమనించాలని సూచించింది.
ఫైబర్ గ్రిడ్ లో 2 వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటూ దుష్ర్పచారం చేయడాన్ని ఖండించింది.పంచాయతీలోనూ ఆస్తి పన్ను పెంచేందుకు నిర్ణయించడం జగన్ చేతకాని తనానికి నిదర్శనం అని తప్పుబట్టింది.