పార్టీ భవిష్యత్తుపై బెంగ, వచ్చే ఎన్నికల్లో గెలుస్తామా లేదా అనే సందేహాలు, ఆందోళనలు టీడీపీ అధినేత చంద్రబాబులో రోజు రోజుకి పెరిగిపోతున్నాయి.అందుకే రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే పార్టీని పరుగులు పెట్టించేందుకే బాబు సిద్ధమవుతున్నారు.
పార్టీ నాయకుల్లో నిరాశానిస్పృహలు పెరిగిపోతుండటం, తాము పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నా, టీడీపీ పట్టించుకోనట్టు గా వ్యవహరిస్తూ, అవమానాలకు గురి చేస్తూ ఉండటం వంటి పరిణామాలను బాబు లెక్కలు వేసుకుంటున్నారు.ఘనమైన చరిత్ర ఉన్న టీడీపీ కి ఈ దుస్థితి రావడానికి కారణం ఏమిటి అనే విషయాన్ని బాబు లెక్కలు వేసుకుంటున్నారు.అందుకే బీజేపీ అవమానించినా, మీ అవసరం మాకు లేదు అంటూ మొఖం మీదే చెప్పేస్తున్నా బాబు మాత్రం ఆ పార్టీ వెంటే పడుతూ వస్తున్నారు.2019 ఎన్నికల్లో బీజేపీ గెలిచే అవకాశమే లేదనే అంచనాలు ఏర్పడడం, బీజేపీతో కలిస్తే టీడీపీకి రాజకీయ భవిష్యత్తు ఉండదనే లెక్కలు ఇలా ఎన్నో కారణాలతో బీజేపీతో పొత్తును బాబు రద్దు చేసుకున్నారు.

అక్కడితో ఆగకుండా 2019 ఎన్నికల సమయం వరకు బీజేపీని విమర్శిస్తూనే వచ్చారు.జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమి కి మద్దతు ఇవ్వడం, ముఖ్యంగా కాంగ్రెస్ కు సహకరించడం, కాంగ్రెస్ నాయకులను ఏపీలో ఎన్నికల ప్రచారానికి తిప్పడం, ఇలా ఎన్నో జిమ్మిక్కులు చేసినా తెలుగుదేశం పార్టీ ఏపీలో అధికారంలోకి రాలేకపోయింది.ఆ తరువాత గాని చంద్రబాబుకు తాను చేసిన తప్పేమిటో అర్థం కాలేదు.ఇప్పుడు బీజేపీ ని మొత్తుకుంటున్నా, ఆ పార్టీ నాయకులు పెద్దగా కనికరించడం లేదు.పోనీ ఒంటరిగా ఎన్నికలకు వెళదామా అంటే 2019 ఫలితాలు రిపీట్ అవుతాయేమో అనే భయం ఎక్కువగా కనిపిస్తోంది.అందుకే కుదిరితే బీజేపీ, లేకపోతే కాంగ్రెస్ పార్టీతోనే ముందుకు వెళ్లాలని, ఆ పార్టీ ఓటు బ్యాంకును ఉపయోగించుకుని కాస్త బలం పెంచుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
అందుకే మరి కొద్ది రోజుల పాటు బీజేపీ వైఖరిని అంచనా వేసి, ఆ తర్వాత కాంగ్రెస్ వైపు వెళితే మంచిదనే అభిప్రాయంలో బాబు ఉన్నట్లుగా తాజాగా టీడీపీలో వినిపిస్తున్న గుసగుసలు.మొత్తంగా చూస్తే కాంగ్రెస్ తో పొత్తు విషయం ఫై బాబు ఆలోచనలో ఉన్నట్టుగానే కనిపిస్తోంది.