ఏపీలో బలపడాలంటే ఏం చేయాలనే విషయంలో ఎట్టకేలకు బీజేపీ ఒక క్లారిటీ కి వచ్చేసింది.మొహమాటం పడుతూ రాజకీయాలు చేస్తే, ఎప్పటికీ ఏపీలో రాజకీయ ఉనికి కోల్పోవాల్సిందనే అభిప్రాయంతో ఉన్న బిజెపి కొత్త రథసారధిగా సోము వీర్రాజు ను నియమించింది.
ఆయన ఆ పదవి బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి దూకుడుగా ముందుకు వెళుతూ, పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే విధంగా వ్యవహరిస్తున్నారు.ఈ విషయంలో సొంత పార్టీ నాయకులను సైతం ఆయన లెక్క చేయకుండా బీజేపీని బలోపేతం చేసే విషయంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు.
ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న బీజేపీ నాయకులను గుర్తించే పనిలో ఉండడమే కాకుండా, అటువంటి వారిని గుర్తించి పార్టీ నుంచి సాగనంపే కార్యక్రమం కు కూడా శ్రీకారం చుట్టినట్టు కనిపిస్తున్నారు.ఇదంతా ఇలా ఉంటే, టిడిపిలో ఉన్న సమయంలో చంద్రబాబు కి అత్యంత సన్నిహితుడిగా ముద్ర వేయించుకున్న రాజ్యసభ సభ్యులు కొంతమంది బిజెపిలో చేరిన విషయం తెలిసిందే.
వారు బిజెపి లో ఉన్నా, వారి మనసంతా టిడిపి వైపు అన్నట్టుగా వారి వ్యవహారం నడుస్తూ వస్తోంది.ముఖ్యంగా ఈ విషయంలో బిజెపి రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఎక్కువగా కార్నర్ అవుతున్నారు.
అమరావతి వ్యవహారంలో టిడిపి చేస్తున్న పోరాటానికి మొదటి నుంచి ఆయన మద్దతుగా మాట్లాడుతూ వస్తున్నారు.బిజెపి కేంద్ర పెద్దల అభిప్రాయం ఏమిటో స్పష్టంగా ప్రకటించకపోయినా, సుజనాచౌదరి అమరావతి వ్యవహారంలో బిజెపి తరఫున స్టేట్మెంట్లు ఇస్తున్నారు.
ఈ విషయంలో అధిష్టానం పెద్దల ఆగ్రహం గానే ఉన్నా, కట్టడి చేసేందుకు పెద్దగా ప్రయత్నించలేదు.దీంతో మీడియా సమావేశాలు నిర్వహించి ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, టిడిపి కి అనుకూలంగా ఆయన స్టేట్మెంట్లు ఇస్తూ వస్తున్నారు.

కానీ ఇప్పుడు బీజేపీలో ఉంటూ, టిడిపి వాదనను సమర్థించేవారిపై వేటు వేస్తూ వస్తోంది బీజేపీ.ఈ పరిణామాలు బిజెపి లో ఉన్న బాబు అనుకూల నాయకులకు మింగుడు పడడం లేదు.ప్రత్యక్షంగా అటువంటి వారికి బిజెపి వార్నింగ్ ఇవ్వకపోయినా, పరోక్షంగా ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు అన్నట్లు వ్యవహరిస్తోంది.కొద్దిరోజులుగా ఈ వ్యవహారాలతో సుజనాచౌదరి వంటివరు సైలెంట్ అయిపోయినట్లు తెలుస్తోంది.
ఆయన మరో ఏడాదిన్నర మాత్రమే పదవిలో కొనసాగుతారు.అప్పుడు ఆయన బీజేపీలో ఉంటారా లేక సొంత గూటికి వెళ్తారా అనేది అనుమానంగానే ఉంది.
ఎందుకంటే నేరుగా తమ పేర్లను ప్రస్తావించక పోయినప్పటికీ బాబు అనుకూల బిజెపి నాయకులకు గట్టిగానే వార్నింగులు వెళుతుండటంతో ఎవరికివారు సైలెంట్ అయిపోయినట్టుగా కనిపిస్తున్నారు.అనవసరంగా టీడీపీకి అనుకూలంగా వ్యవహరించి బీజేపీ అధిష్టానం చెడ్డ పేరు తెచ్చుకోవడం కంటే సైలెంట్ గా ఉండడమే ప్రస్తుత పరిస్థితుల్లో బెటర్ అన్నట్టుగా బాబు అనుకూల బిజెపి నాయకులు ఒక అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
ఒకవేళ అలా కాకుండా మళ్లీ టిడిపి కి అనుకూలంగా సుజనా చౌదరి వంటివారు గళమెత్తితే, వారిపై వేటు వేసేందుకు కూడా బీజేపీ వెనకాడేలా కనిపించడం లేదు.