ఒకవైపు రాజకీయ ప్రత్యర్థుల తో జగన్ పెద్ద యుద్ధమే చేస్తూ, పార్టీని ముందుకు తీసుకు వెళుతుంటే, సొంత పార్టీ నాయకులే ఒకరిపై ఒకరు ఆధిపత్య పోరు చెలాయిస్తూ , అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారారు.నాయకులంతా సఖ్యతగా ఉంటూ, పార్టీ అభివృద్ధికి పాటుపడాలని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి మంచి పేరు సంపాదించాలని జగన్ పదేపదే చెబుతున్నా, నాయకుల వ్యవహార శైలిలలో పెద్దగా మార్పు కనిపించడం లేదు.
ప్రతి నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు పెరిగిపోయాయి.ఈ వ్యవహారాలపై ఇప్పుడిప్పుడే జగన్ ప్రత్యేక దృష్టిసారించి పార్టీ నాయకులకు వార్నింగ్ ఇస్తూ వస్తున్నారు.
ముఖ్యంగా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, బాపట్ల ఎంపీ నందిగాం సురేష్ కి మధ్య వివాదం కొంతకాలంగా తారస్థాయికి చేరింది.
ఇద్దరూ ఒకే పార్టీకి చెందిన వారు అయినా, ఇద్దరు వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు.
ఉండవల్లి శ్రీదేవి విషయానికొస్తే ఆమె వరుసగా అనేక వివాదాల్లో చిక్కుకున్నారు.ఆమె అనుచరులు పైన పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
అలాగే ఆర్థిక పరమైన అంశాల విషయంలో శ్రీదేవి పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.కొద్ది రోజుల క్రితం ఓ పోలీస్ అధికారితో ఆమె మాట్లాడిన వ్యాఖ్యలు మీడియాలో వైరల్ అయ్యాయి.
దీంతో అధిష్టానం పెద్దలు ఫోన్ చేసి గట్టిగా క్లాస్ పీకినట్లు తెలుస్తోంది.ఈ సందర్భంగా ఎంపీపీ తో వివాదం విషయంపైన గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో, అసలు తనకు సంబంధించిన అన్ని వ్యవహారాలు
ఇలా బయటకు రావడానికి ఎంపీ వర్గం కారణమనే అభిప్రాయం శ్రీదేవి లో ఉంది.
అయితే ఇప్పుడు పంతాలకు, పట్టింపులకు పోతే తన రాజకీయ భవిష్యత్తు కు ఇబ్బంది ఏర్పడుతుంది అనే అభిప్రాయంతో ఎంపీ తో సయోధ్యకు ఎమ్మెల్యే శ్రీదేవి ప్రయత్నాలు కొద్దిరోజులుగా చేస్తున్నారు.ఈ మేరకు ఆయన నివాసానికి వెళ్లి అన్ని విషయాల పైన చర్చించినట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా ఒకరి విషయాల్లో మరొకరు వేలు పెట్టకూడదు అని, పార్టీ అభివృద్ధి కోసం పాటుపడాలని ఒక అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది.మొదట్లో శ్రీదేవితో రాజీ పడేందుకు నందిగాం సురేష్ ససేమిరా అన్నా, అధిష్టానం పెద్దల సూచనలతో మెత్తపడినట్టుగా తెలుస్తోంది.