తెలంగాణలో ఆశించినంత స్థాయిలో బీ ఆర్ ఎస్ కు అనుకూల పవనాలు లేకపోవడం, చేరికలు అంతంత మాత్రమే అన్నట్టుగా ఉండడం , ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన కీలక నేతలు పార్టీని వీడేందుకు సిద్ధమవుతుండడం , ఎన్నికల సమయం నాటికి బీజేపీ చేరికలను ప్రోత్సహించేందుకు ప్రయత్నించడం తదితర కారణాలు అన్నిటిని బి ఆర్ ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ అంచనా వేస్తున్నారు .తెలంగాణలో పట్టు పెంచుకునేందుకు, పార్టీ విజయానికి ఎటువంటి డోకా లేకుండా చేసుకునేందుకు కేసీఆర్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
దీనిలో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యే , ఎంపీలపై ఇంటిలిజెన్స్ వర్గాల ద్వారా నిఘా పెట్టినట్లు ప్రచారం జరుగుతుంది.రాష్ట్ర ఇంటిలిజెన్స్ సిబ్బంది ఇప్పటికే రంగంలోకి దిగారట.

మండలానికి ఒకరు చొప్పున ప్రజా ప్రతినిధుల పై నిఘా పెట్టారట. ఏ ముఖ్య నాయకుడిని ఎవరెవరు కలుస్తున్నారు ? టిఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు రాబోయే ఎన్నికల్లో పార్టీ నుంచి పోటీ చేస్తారా లేక బిజెపి వైపు మొగ్గు చూపిస్తున్నారా ? వారిని ఎవరెవరు ఎందుకు కలుస్తున్నారు ? ఇలా అన్ని విషయాల పైన ఆరా తీస్తున్నట్లు సమాచారం.ఎంపీలు, ఎమ్మెల్యేలు జెడ్పీ చైర్పర్సన్ ల విషయంలో షాడో టీంలు వారి వెన్నంటే ఉంతున్నాయట.ప్రభుత్వ పథకాల అమలు తీరు, ముఖ్య కార్యకర్తలు , సాధారణ ప్రజల విషయంలో వారు వ్యవహరిస్తున్న తీరు ఇలా అన్నిటిని నిఘా వర్గాలు నిశితంగా పరిశీలిస్తున్నాయట.
అలాగే రాజకీయ ప్రత్యర్థులతో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు చేస్తున్న వ్యాపార వ్యవహారాల పైన ఆరా తీస్తున్నారట.అయితే కొంతమంది ప్రజా ప్రతినిధులు ఇంటిలిజెన్స్ వర్గాలకు దొరక్కుండా గన్ మెన్ లను సైతం వదిలి వెళుతున్న ఘటనలను నిఘా వర్గాలు గుర్తించాయట.

ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలు మధ్య ఉన్న విభేదాలు, దాని కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న దాదాపు 30 నియోజకవర్గాల ప్రజా ప్రతినిధుల పై ఇంటిలిజెన్స్ వర్గాలు ప్రత్యేకంగా ఫోకస్ చేసాయట.ఈనెల 18న ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ సభను నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆ సమయంలో రాజకీయ వలసలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందా అనే విషయం పైన ఆరా తీస్తున్నారట. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో కీలక నాయకుడుగా ఉన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కదలికల పైన ప్రత్యేకంగా ఆరా తీస్తున్నారట .ఈ వ్యవహారం ఇలా ఉంటే కేంద్ర హోంశాఖకు చెందిన ఇంటిలిజెన్స్ సిబ్బంది కూడా ఇప్పుడు రంగంలోకి దిగారట .ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయ పరిణామాలపై వారు ఫోకస్ పెట్టారట.కేంద్ర మంత్రుల పర్యటనలో స్థానిక ఆందోళనలు, ఇతర పార్టీల్లో అసంతృప్తితో ఉన్న నాయకుల వ్యవహారాల పైన వారు ఆరా తీస్తున్నట్లు సమాచారం.