చాలా మంది ఇటీవల కాలంలో భుజం నొప్పితో బాధపడుతున్నారు.శరీరానికి తగిన వ్యాయామం లేక భుజం నొప్పి వారిని వేధిస్తుంటోంది.
పడుకుని లేవగానే, ఏదైనా పని చేస్తున్న సమయంలోనో అకస్మాత్తుగా భుజం నొప్పి రావడంతో విలవిల్లాడుతుంటారు.ఏ పనీ చేయలేక ఇబ్బంది పడుతుంటారు.
దీని పట్ల చింతించాల్సిన అవసరం లేదని, చిన్న చిన్న చిట్కాలు ఈ సమస్యకు అద్భుత పరిష్కారం చూపుతాయని నిపుణులు పేర్కొంటున్నారు.
పడుకుని లేవగానే భుజం పట్టేయడం వంటి లక్షణాలుంటే దానిని వైద్య పరిభాషలో క్యాప్సులిటిస్ అని పిలుస్తుంటారు.
దీని వల్ల భుజం వద్ద జాయింట్‌లో తట్టుకోలేని నొప్పి వస్తుంది.దీనిని ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా, పరిస్థితి తీవ్రంగా ఉంటుంది.ముఖ్యంగా 40 ఏళ్లు దాటిన వారిలోనూ, థైరాయిడ్, డయాబెటిస్ వంటి వ్యాధులతో బాధపడే వారినీ ఇది మరింత ఇబ్బంది పెడుతుంది.అందుకే చిన్నపాటి వ్యాయామాలు దీనికి పరిష్కారంగా నిపుణులు సూచిస్తున్నారు.
పెండ్యులమ్ ఎక్సర్‌సైజ్
భుజం నొప్పిని అరికట్టడానికి ఈ ఎక్సర్ సైజ్ చక్కటి పరిష్కారం.దీనిని తెలుగులో లోలకం వ్యాయామం అంటారు.ఈ పద్ధతిలో భాగంగా నడుము వరకు ముందు వైపు శరీరాన్ని వంచాలి.చేతులపై ఎలాంటి ఒత్తిడి లేకుండా ఫ్రీగా చేతులు వదిలేయాలి.
ఆ తర్వాత భుజం వద్ద కీలుపై ఒత్తిడి లేకుండా చేతిని రౌండ్‌గా తిప్పుతూ ఉండాలి.రోజుకు రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఇలా చేస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

టవల్ స్ట్రెచింగ్
ఇందులో భాగంగా మూడు అడుగుల పొడవున్న టవల్‌ను తీసుకోవాలి.ఒక కుర్చీలో కూర్చుని నొప్పి ఉన్న చేతిని పైకి ఉండేలా, మరో చేయి వీపు భాగం నుంచి కిందికి ఉండేలా టవల్ పట్టుకోవాలి.ఆ తర్వాత మెల్లగా టవల్‌ను సాగదీస్తున్నట్లు చేయాలి.ఇలా కనీసం ఒక నిమిషం నుంచి రెండు నిమిషాల పాటు చేయాలి.దీంతో కొన్ని రోజులకు భుజం నొప్పి దూరం అవుతోంది.