ఏపీ అధికార పార్టీ వైసిపి , తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ మధ్య ఎంత సఖ్యత ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ అన్ని విషయాల్లోనూ ఒకరికొకరు సహకరించుకుంటూ , స్నేహభావం తోనే ముందుకు వెళ్తున్నారు.
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు టిఆర్ఎస్ ఎంత గా సహకరించిందో అందరికీ తెలుసు.ఏపీలో టీడీపీ అధికారంలోకి రాకూడదు అనే అభిప్రాయం కెసిఆర్ లో బలంగా ఉండడం, జగన్ తో స్నేహం కోరుకోవడం వంటి కారణాలతో వీరి మధ్య స్నేహబంధం అలా కొనసాగుతూ వస్తోంది.
అయితే తాజాగా కెసిఆర్ కుమారుడు మంత్రి కేటీఆర్ ఏపీ లో నెలకొన్న పరిస్థితులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, కరెంటు కోతలు ఎక్కువయ్యాయని, సామాన్య జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఏపీలో అభివృద్ధి లేదనే విషయాన్ని తన మిత్రుడు తనకు చెప్పారు అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించడం దుమారమే రేపింది.
కేటీఆర్ వ్యాఖ్యలపై వైసీపీ మంత్రులు కొంతమంది రకరకాలుగా స్పందించారు.సుతిమెత్తగా విమర్శలు చేశారు.ఇప్పటికీ ఈ వార్ అలాగే కొనసాగుతోంది. ఏపీ లో నెలకొన్న సమస్యలను హైలెట్ చేయడం ద్వారా కేటీఆర్ వ్యూహం ఏమిటనేది వైసిపి అంచనా వేసే పనిలో పడింది.
గత కొంతకాలంగా బిజెపికి వ్యతిరేకంగా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు తెలంగాణ సీఎం, టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.వివిధ ప్రాంతీయ పార్టీల అధినేతలతో ఆయన సమావేశాలు నిర్వహిస్తున్నారు.
బిజెపికి వ్యతిరేకంగా రాజకీయ ప్రత్యామ్నాయ కూటమిని తెరపైకి తెచ్చి 2024 ఎన్నికల్లో అధికారంలోకి తీసుకురావాలని, కాంగ్రెస్ బిజెపిలకు ప్రత్యామ్నాయంగా కేంద్రంలో అధికారంలోకి రావాలనే పట్టుదలతో కెసిఆర్ ఉన్నారు.

అయితే ఆశించిన స్థాయిలో ఆయన వెంట నడిచేందుకు దేశవ్యాప్తంగా చాలా ప్రాంతీయ పార్టీలు ఇష్టపడకపోవడం , ఏపీలో తనకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న సీఎం జగన్ తన వెంట నడిచేందుకు ఇష్టపడకపోవడం, బిజెపికి అనుకూలంగానే ఇప్పటికీ నిర్ణయాలు తీసుకోవడం వంటివి కేసీఆర్ కు ఆగ్రహం కలిగించాయని,ఆ ఆగ్రహాన్ని మంత్రి కేటీఆర్ ద్వారా ఈ విధంగా చెప్పించాడని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.కేటీఆర్ వ్యాఖ్యలకు వైసిపి స్పందన నామమాత్రంగానే ఉంది.ముఖ్యంగా ఈ విషయాన్ని రాజకీయం చేయదల్చుకోలేదు అని జగన్ మాటగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు.
బీజేపీకి జగన్ మద్దతు ఉండడమే టిఆర్ఎస్ యూ టర్న్ తీసుకోవడానికి కారణం గా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.దానిలో భాగంగానే కేటీఆర్ ఈ విధంగా సంచలన వ్యాఖ్యలు చేసినట్టుగా చర్చ జరుగుతోంది.







