టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా కొందరికి కొన్ని నమ్మకాలు ఉంటాయి.అవి ఎంతలా ఉంటాయంటే వాటి కోసం వారు అస్సలు రాజీ పడరు.
జాతకాల పైనా, న్యూమరాలజీ పైనా నమ్మకాలు పెట్టుకుంటూ ఉంటారు.ఇప్పటికీ కొందరు సెలబ్రెటీలు అదృష్టం కలిసి వస్తుందని తమ పేర్లలో అక్షరాలను తగ్గించడం, పెంచడం వంటి మార్పులు చేస్తుంటారు.
అలా చేస్తే కలిసి వస్తుందని వారి ప్రగాఢ విశ్వాసం.అయితే ఉద్యోగాలు ఇచ్చే క్రమంలో ఎవరైనా టాలెంట్ చూస్తారు.
ఓ కంపెనీ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించింది.టాలెంట్ కంటే, వారి ఫోన్ నంబరులో ఓ అంకె తమకు నచ్చలేదని ఉద్యోగాలు ఇవ్వనట్లు చెప్పింది.
ఆ ఫోన్ నంబరు మార్చుకుంటే ఉద్యోగం కల్పిస్తామని హామీనిచ్చింది.ఇదెక్కడి రూల్ అంటూ సదరు అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు.
తాజాగా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పెట్టడంతో విషయం వైరల్ అయింది.

చైనాలోని షెన్‌జెన్‌లోని ఎడ్యుకేషన్ కంపెనీ బాస్, ఇటీవల తన కంపెనీలో ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహించాడు.అంతా అయిపోయిన తర్వాత కొంత మందికి కోలుకోలేని షాక్ ఇచ్చాడు.ఫోన్ నంబర్‌లో ఐదవ అంకెగా ఐదవ నంబర్ ఉన్న వ్యక్తులను నియమించుకోవడానికి నిరాకరించాడు.
దీంతో ఈ విచిత్రమైన నిర్ణయంతో అతడు విమర్శల పాలయ్యాడు.ఉద్యోగ దరఖాస్తుదారులకు సంస్థలో ఉద్యోగాలు పొందాలంటే ఆ ఫోన్ నంబరు మార్చుకోవాలని సూచించాడు.
ఫోన్ నంబర్‌లో ఐదవ అంకెగా 5 ఉండకూదని కొందరు బలంగా నమ్ముతారు.అలా ఉంటే దురదృష్టం వస్తుందనే మూఢనమ్మకం ఉంది.
నైపుణ్యాలు, చదువుతో పని లేకుండా ఇలాంటి విచిత్ర నిర్ణయం తీసుకోవడం నెటిజన్లను విస్మయానికి గురి చేస్తోంది.ఇది 21వ శతాబ్దమని, ఇంకా అలాంటి మూఢ నమ్మకాలు ఉన్న అధికారులు ఉన్నారా అని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా కమ్యూనిజం పాటించే చైనాలో ఇలాంటి నమ్మకాలా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.ఇదిలా ఉండగా కొంతమంది మూఢ నమ్మకాలు పాటిస్తున్న మేనేజర్ నిర్ణయంతో ఏకీభవించారు.
ఫోన్ నంబర్‌లో సున్నా లేదా ఐదు ఉండకపోతే బాగుంటుందని పెద్దలు చెప్పినట్లు ఓ నెటిజన్ పేర్కొన్నాడు.