ఆర్టీసీ ఖేల్ ఖతం.ఇక అది గతం.48 వేల మంది ఉద్యోగాలు ఊడినట్లే.కోర్టు కూడా ఏమీ చేయలేదు.
ఆర్టీసీని మొత్తం ప్రైవేటీకరిస్తాం.కార్మికుల గొంతెమ్మ కోర్కెలను తీర్చేదే లేదు.
ఇదీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ సమ్మె మొదలైన కొత్తలో చేసిన వ్యాఖ్యలు.సరిగ్గా రెండు నెలలు గడిచాయి.
సీన్ కట్ చేస్తే.ఇప్పుడు అదే ఆర్టీసీపై ఏడాదికి వెయ్యి కోట్ల వరాలు.
కనీసం రూ.47 కోట్లు కూడా ఇవ్వలేరా.ఇదేనా మీ ధనిక రాష్ట్రం అంటూ కోర్టు కూడా మొట్టికాయలు వేసినా ఏమీ పట్టనట్లున్న కేసీఆర్.ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల డిమాండ్లలో చాలా వరకు నెరవేర్చడంతోపాటు వాళ్లు అడగని వాటినీ ఇస్తున్నట్లు ప్రకటించారు.
రిటైర్మెంట్ వయసు 58 ఏళ్ల నుంచి 60కి పెంపు, ఇష్టం వచ్చిన రంగుల యూనిఫాం, సమ్మెకాలానికి జీతం, చనిపోయిన కుటుంబాల వారికి ఉద్యోగాలు.ఇలా చేతికి ఎముకే లేదన్నట్లు హామీలు గుప్పించారు.

మరి ఏకంగా 52 రోజుల పాటు సమ్మె చేసినప్పుడు కేసీఆర్ ఇలా ఎందుకు స్పందించలేదు.ఏకంగా 30 మంది కార్మికులు బలయినా, సమ్మె కారణంగా ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నా.ఎందుకు కనికరించలేదు? అంటే తన మాట కాదని సమ్మె చేస్తున్నారన్న ఒకే ఒక్క కారణంతో కక్ష సాధింపులకు పాల్పడ్డారా? తన అహం దెబ్బతిన్నదని ఫీలయ్యారా? ఇప్పుడు తప్పయింది.క్షమించండి అని కాళ్ల బేరానికి రావడంతో వాళ్లపై ఎక్కడ లేని ప్రేమ కురిపిస్తున్నారు.
ప్రజలను తన పిల్లలుగా చూసుకోవాల్సిన ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహరించే తీరు ఇదేనా అంటూ సోషల్ మీడియాలో పలు పోస్టులు వైరల్‌గా మారుతున్నాయి.వాళ్ల డిమాండ్లలో సగం నెరవేర్చినా సమ్మె ఎప్పుడో ఆగిపోయి వాళ్ల ప్రాణాలు నిలబడేవి.
ప్రజలకు ఇబ్బందులు తప్పేవి కదా.ఎందుకింత పంతం అంటూ కేసీఆర్‌ను నిలదీస్తున్నారు.