పొట్లకాయ( Snake Gourd ) తీగ జాతి పంటలలో ఒకటి.ఈ పొట్లకాయ చూడడానికి పాము లాగా కనిపించినప్పటికీ చాలా రుచికరంగా ఉంటుంది.
అయితే సరైన అవగాహన లేకపోవడం వల్ల రైతులు ఆశించిన ఫలితాలు పొందలేకపోతున్నారు.పొట్లకాయ సాగులో అధిక దిగుబడి కోసం పాటించవలసిన మేలైన యాజమాన్య పద్ధతులు ఏమిటో చూద్దాం.
సాధారణంగా పొట్లకాయ ముదురు ఆకుపచ్చ, లేత ఆకుపచ్చ రంగులో రెండు రకాలుగా ఉంటుంది.వాతావరణ పరిస్థితులను బట్టి, నేలలోని భూసారాన్ని బట్టి ఏ రకం విత్తనాలను సాగు చేసుకోవాలో ఎంచుకోవాలి.
పొట్లకాయ సాగు( Snake Gourd Farming )కు అధిక తేమ అవసరం.

పొట్లకాయ విత్తనాలను( Sankae Gourd Seeds ) జనవరి రెండో వారం వరకు విత్తుకోవచ్చు.ఈ పంటను పందిరి విధానంలో సాగు చేయాలి.మొక్కల మధ్య 80 సెంటీమీటర్ల దూరం, వరుసల మధ్య రెండు మీటర్ల దూరం ఉంటే మొక్కలకు సూర్యరశ్మి, గాలి బాగా తగిలి మంచి దిగుబడి సాధించడానికి వీలు ఉంటుంది.
పంటకు నీటి అవసరం చాలా ఎక్కువ.పంట విత్తిన ఐదవ రోజు నుండి తేలికపాటి తడులు అందించాలి.పొట్లకాయ అభివృద్ధి దశలో ఉన్నప్పుడు నీటిని సమృద్ధిగా అందించాలి.ఈ విత్తనాలు విత్తిన పది రోజుల్లో మొలకెత్తుతాయి.
మొలకెత్తిన 30 రోజుల సమయంలో గొర్రు లేదా గుంటికతో అంతర కృషి చేపట్టాలి.
ఒక సన్నని వైరు లేదా తాడుతో తీగలను పందిరి పైకి పాకే విధంగా చర్యలు తీసుకోవాలి.
నీటి తడులను రాత్రిపూట కాకుండా కేవలం పగటిపూట మాత్రమే పంటకు అందించాలి.ఇక చీడపీడల, తెగుళ్ల విషయానికి వస్తే పొట్లకాయ విత్తుకోవడానికి ముందే విత్తన శుద్ధి చేయడం వల్ల చాలా వరకు తెగులను చీడపీడలను నివారించవచ్చు.

ఈ పొట్లకాయ పంటకు బూజు తెగులు, బూడిద తెగులు, వెర్రి తెగులు, ఆకుమచ్చ తెగులు ఆశించి తీవ్ర నష్టం కలిగిస్తాయి.ఇక పండు ఈగ, గుమ్మడి పెంకు పురుగులు ఆశించి తీవ్ర నష్టం కలిగిస్తాయి.పంటని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటూ వ్యవసాయ క్షేత్ర నిపుణుల సలహా తీసుకొని పిచికారి మందులు ఉపయోగించి వీటిని తొలి దశలోనే అరికడితే అధిక దిగుబడి సాధించవచ్చు.







