దుంప జాతి( Root Vegetables ) పంటలలో చామ దుంప పంట ఒకటి.మిగతా దుంప జాతి పంటలతో పోలిస్తే చామదుంపలో అధిక శాతం లో ఖనిజ లవణాలు, విటమిన్లు ఉంటాయి.
సాధారణంగా కూరగాయలు కోతకు వచ్చాక ఎక్కువ కాలం నిలువ ఉండవు.కానీ చామదుంప కోతకు వచ్చిన తర్వాత దాదాపు 6 వారాలు ఆలస్యంగా తవ్వుకోవచ్చు.
ఇంకా చామదుంపలకు చీడపీడల బెడద చాలా తక్కువ.కాబట్టి రైతులు ఈ పంటను సాగు చేయడానికి అధిక ఆసక్తి చూపిస్తున్నారు.
మెరుగైన మెళుకువలతో ఎలా సాగు చేయాలో తెలుసుకుందాం.

చామ దుంప సాగు( Colocasia Cultivation ) చేసే నేల ఉదజని సూచిక 5.5-7.0 మధ్య ఉండి, నీటి వసతి అధికంగా ఉండి, మురుగునీరు బయటకు పోవు సౌకర్యం కలిగిన నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి.సేంద్రియ ఎరువులకు అధిక ప్రాధాన్యం ఇస్తే అధిక దిగుబడి పొందవచ్చు.ఈ పంటను ఖరీఫ్ లో సాగు చేయాలనుకుంటే జూన్ లేదా జూలై నెలలో విత్తుకోవచ్చు.వేసవిలో సాగు చేయాలనుకుంటే ఫిబ్రవరి- ఏప్రిల్ నెలలో విత్తుకోవచ్చు.
ఒక ఎకరాకు సుమారుగా 350 కిలోల దుంపలు అవసరం.
తెగులు లేని ఆరోగ్యంగా ఉన్న, అన్ని ఒకే సైజు కలిగిన దుంపలను విత్తనాలుగా ఎంపిక చేసుకోవాలి.ఆ తర్వాత పది లీటర్ల నీటిలో 50 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ మరియు 25 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ కలిపిన ద్రావణంలో 15 నిమిషాలు ముంచి తీసి నీడలో ఆరబెట్టుకొని పొలంలో విత్తుకోవాలి.
చామ దుంప మొక్కల మధ్య 30 సెంటీమీటర్ల దూరం మొక్కల వరుసల మధ్య 45 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు నాటుకోవాలి.

ఒక ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు( Cattle Manure ), 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్ ఎరువులు వేసుకోవాలి.యూరియా 100 కిలోలు, పోటాష్ 50 కిలోల ఎరువులు అవసరం.వాతావరణ పరిస్థితులను బట్టి నాలుగు రోజులకు ఒకసారి నీటి తడి అందివ్వాలి.
సూక్ష్మ పోషక లోపాలు ఉంటే దుంపలు నాటిన రెండు నెలల తర్వాత ఒక లీటర్ నీటిలో రెండు గ్రాముల సూక్ష్మ పోషకాల మిశ్రమం కలిపి పిచికారి చేయాలి.ఎప్పటికప్పుడు కలుపు నివారణ చర్యలు( Weed control ) చేపట్టాలి.
దుంప మొక్కల ఆకులు పసుపు రంగులోకి మారితే నీటి తడులు తగ్గించాలి.మార్కెట్లో మంచి ధర ఉన్న సమయంలో కోతలు నిర్వహించి మార్కెట్ కు తీసుకెళ్లాలి.
ఒక ఎకరం పొలంలో దాదాపుగా 20 టన్నుల వరకు దుంపల దిగుబడి పొందవచ్చు.







